09-07-2025 12:00:00 AM
నాగర్‌కర్నూల్/గద్వాల, జూలై 8 (విజయక్రాంతి)/నాగార్జునసాగర్: ఎగువన కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జూరాల నుంచి శ్రీశైలానికి భారీగా వరద వచ్చి చేరుతుండటంతో అధికారులు మంగళవారం నాలుగు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలారు. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ హాజరయ్యారు. ముందుగా కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నాలుగు క్రస్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.
దీంతో నాగార్జున సాగర్ వైపు కృష్ణమ్మ పరుగులు పెడుతున్నది. ఎగువన ఉన్న జూరాలకు 1.25 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా ప్రాజెక్టు నుంచి 14 గేట్లు ద్వారా 1.26 లక్షల క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం వైపు పరుగులు పెడుతున్నది. శ్రీశైలం ప్రాజెక్టుకు 1.98 లక్షల క్యూసెక్కుల వరద జలాలు వచ్చి చేరుతున్న సందర్భంగా శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం మొత్తం సామర్థ్యం 885 అడుగులు ఉండగా ప్రస్తుతం 880.40 అడుగులకు చేరుకుంది.
ప్రాజెక్టు నీటి సామర్థ్యం 215. 8070 సామర్ధ్య ఉండగా సోమవారం ఉదయం నాటికి 190.300 టీఎంసీల సామర్థ్యానికి చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టు ఏపీ కుడిగట్టు విద్యుత్ ఉత్పత్తి 31,704 క్యూసెక్కులు కాగా, తెలంగాణ విద్యుత్తు ఎడమగట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా 35,315 క్యూసెక్కుల నీటిని వాడుతూ మొత్తంగా విద్యుత్ ఉత్పత్తి కోసం 59,239 వేల క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వదులుతున్నారు.
నాగార్జునసాగర్‌కు జలకళ
భారీ వర్షాల కారణంగా సాగర్ రిజర్వాయర్ నీటిమట్టం 532 అడుగులకు చేరుకుంది. నాగార్జున సాగర్ జలాశయం గరిష్ట స్థాయి నీటిమట్టం 590 అడుగులు (312.040 టీఎంసీలు కాగా), ప్రస్తుతం 532 అడుగులకు(172.0760 టీఎంసీలు) చేరింది. సాగర్‌కు ఇన్‌ఫ్లో 1,14,146 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 4,590 క్యూసెక్కులు ఉన్నది.