calender_icon.png 27 September, 2025 | 11:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాలస్తీనాకు అండగా!

23-09-2025 12:00:00 AM

హమాస్ సంస్థ అంతమే లక్ష్యంగా గాజా సిటీపై ఇజ్రాయెల్ సైన్యం భీకర దాడులు కొనసాగిస్తున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్‌కు మిత్ర దేశాలైన బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియాలు పాలస్తీనాను దేశంగా గుర్తిస్తున్నట్టు ప్రకటించాయి. ఈ మేరకు బ్రి టన్ ప్రధాని కీర్ స్టార్మర్, కెనడా ప్రధాని మార్క్ కార్నే, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌లు ఆదివారం సంయుక్తంగా ప్రకటన విడుదల చేశారు.

ఇప్పటికే భారత్, రష్యా, చైనా సహా 147 దేశాలు పాలస్తీనాను దే శంగా గుర్తించినప్పటికీ తాజాగా ఇజ్రాయెల్‌కు అత్యంత సన్నిహిత దేశాలైన బ్రి టన్, కెనడా, ఆస్ట్రేలియా పాలస్తీనాను దేశంగా గుర్తించడం చర్చకు దారి తీసింది. మరోవైపు ఐక్యరాజ్యసమితిలో ఫ్రాన్స్, బెల్జియం, పోర్చుగల్ స హా అనేక దేశాలు పాలస్తీనాను ఒక దేశంగా గుర్తించేందుకు యోచిస్తున్న ట్లు తెలిపాయి. ఇటీవల ఖతార్ రాజధాని దోహా వేదికగా సమావేశమైన హమాస్ నాయకులపై ఇజ్రాయెల్ దాడి చేయడాన్ని గల్ఫ్ దేశాలు తప్పుబట్టాయి.

ఈ దాడితో కోపంగా ఉన్న అరబ్ దేశాలు దోహాలో ప్రత్యే కంగా సమావేశమై ఇజ్రాయెల్‌తో సంబంధాలపై పునఃపరిశీలించనున్న ట్లు పే ర్కొన్నాయి. గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తున్న వేళ పాలస్తీనీయులు ఆకలితో అలమటిస్తూ చనిపోవడం, దీనికి సంబంధించిన ఫొటో లు బయటికి రావడంతో ఇజ్రాయెల్‌పై గుర్రుగా ఉన్న యూరోపియన్ దే శాలు సైతం నెతన్యాహు వైఖరిపై అసంతృప్తిని వెళ్లగక్కాయి. ఇక బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా తమను దేశంగా గుర్తించడంపై పాలస్తీనా విదేశాంగ శాఖ హర్షం వ్యక్తం చేసింది.

పశ్చిమ దేశాలు సాహసోపేత నిర్ణయాలు తీ సుకున్నాయని, ఇదే బాటలో అమెరికా సహా మరిన్ని దేశాలు కూడా పయనించాలని కోరింది. కాగా బ్రిటన్ పాలస్తీనాను దేశంగా గుర్తించడం ఇ జ్రాయెల్‌కు మింగుడుపడని అంశంగా మారింది. ప్రస్తుత ఇజ్రాయెల్, గాజా, వెస్ట్‌బ్యాంక్ ప్రాంతాలు పాలస్తీనాగా తమ పాలనలో ఉన్నప్పుడు బ్రిటన్  1917లో ఇజ్రాయెల్ దేశానికి మద్దతుగా బేల్ఫోర్ డిక్లరేషన్ ప్రకటించింది. ఇన్నాళ్లు పాలస్తీనా స్వయం ప్రతిపత్తిని గుర్తించని బ్రిటన్ ఇటీ వలే మధ్యప్రాచ్యంలో హింసాత్మక వాతావరణం పెరిగిపోతున్న నేపథ్యం లో శాంతియుత వాతావరణానికి దోహదం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తెలిపారు.

పాలస్తీనాను దేశంగా గు ర్తించడం హమాస్ ఉగ్రవాదులకు బహుమతి కాదని.. కేవలం శాంతికి పరిష్కారంగా మాత్రమే ప్రోత్సహిస్తున్నామని బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియాలు నొక్కిచెప్పాయి. మరోవైపు పాలస్తీనాను దేశంగా గుర్తించడంపై అమెరికా వ్యతిరేకించింది. ఇలా చేస్తే ఉగ్రవాద సంస్థ హమాస్‌ను బలోపేతం చేసినట్లే అవుతుందని పేర్కొంది. తమ మిత్ర దేశాలు పాలస్తీనాను దేశంగా గుర్తించడంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఆక్రోశం వెళ్లగక్కారు.

త్వరలో జోర్డాన్ నదికి పశ్చిమ ప్రాంతంలో పాలస్తీనా అనే దేశం ఉండబోదని, 2023 అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు జరిపిన మారణహోమం తర్వాత తమ దేశం మధ్యలో బలవంతంగా ఉగ్రవాద (హ మాస్) రాజ్యాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాన్ని ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వబోమని హెచ్చరికలు జారీ చేశారు. ట్రంప్‌తో భేటీ అనంతరం ఒక కీలక పరిణామం చోటుచేసుకోనుందని నెతన్యాహు పేర్కొనడం చూస్తే పాలస్తీ నా విషయంలో ఏదో జరగబోతుందని అనిపిస్తుంది.