15-12-2025 06:57:23 PM
హైదరాబాద్: రవీంద్ర భారతి ప్రాంగణంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మంత్రి శ్రీధర్ బాబు సోమవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావుతో పాటు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుటుంబసభ్యులు హాజరయ్యారు. తూర్పుగోదావరి జిల్లాలో రూపొందించిన 7.6 అడుగుల బాలు కాంస్య విగ్రహావిష్కరణ అనంతరం 50 మందితో నిర్వహించిన సంగీత విభావరి కార్యక్రమంలో ఆయన ఇష్టపడే 20 గీతాలను గాయకులు ఆలపించనున్నారు.
ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ... ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్నేహశీలి, మృదుస్వభావి అని, ఆయన వివిధ రంగాల్లో ప్రతిభ చూపించారని అన్నారు. తెలుగు పాటకు ఘంటసాల, ఎస్పీ బాలు పట్టం కట్టారని, సినీ సంగీత చరిత్రలో బాలసుబ్రహ్మణ్యం పేరు చిరస్థాయిగా ఉంటుందని వెంకయ్య తెలిపారు. ఎస్పీ గళం సంగీతం దర్శకుడు కోరుకున్నది ఇచ్చే అక్షయపాత్ర అని, గళంలో వైవిధ్యం చూపడం ఆయన ప్రత్యేకత అని గుర్తు చేశారు. ఎస్పీ బాలు తెలుగు ఉచ్ఛారణ వింటుంటే ఎంతో ఆనందంగా ఉండేదని, ఆయన హాస్యం, సమయస్పూర్తి అందరినీ అలరించేవి అన్నారు. పిల్లల్లో సంస్కార బీజాలు నాటేందుకు నిత్యం ప్రయత్నించారని వెంకయ్య నాయుడు చెప్పారు.