01-08-2025 06:56:54 PM
రైతులకు యూరియా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి..
కలెక్టర్ బి.యం.సంతోష్..
గద్వాల (విజయక్రాంతి): వర్షాకాలంలో వ్యాప్తి చెందే సీజనల్ వ్యాధులను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్(District Collector B.M. Santosh) అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బస్తీ దవాఖానను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వైద్య సేవలు ప్రజలకు సమర్థవంతంగా అందించేందుకు అధికారులు పూర్తిస్థాయిలో పని చేయాలని అన్నారు. ఆశ వర్కర్ల వద్ద జ్వరం, దగ్గు వంటి సీజనల్ వ్యాధుల నివారణకు అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. దోమల నివారణకు బ్లీచింగ్, ఆయిల్ బాల్స్, కిరోసిన్ వంటివి వినియోగించాలని, గతంలో ఎక్కువ కేసులు నమోదైన ప్రాంతాలలో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో గర్భిణులను వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించాలన్నారు. వైద్యసిబ్బంది పూర్తి నిబద్ధతతో విధులు నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు.
రైతులకు యూరియా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి..
రైతులకు యూరియా, ఫర్టిలైజర్ అందుబాటులో ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. గద్వాల్ మండలంలోని గంజిలో ఉన్న చిన్న కిష్టయ్య ట్రేడింగ్ కంపెనీ గోదాంను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్, యూరియా స్టాక్, నాణ్యత, ఈ-పాస్ నమోదు ప్రక్రియను పరిశీలించారు.ప్రతి రైతు నుండి ఆధార్ వివరాలు సేకరించి మాత్రమే యూరియా విక్రయాలు జరగాలని, అధిక ధరలకు విక్రయాలు జరిగినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
స్టాక్ బోర్డుపై స్పష్టమైన వివరాలు ప్రతిరోజూ ప్రదర్శించాలని, ఈ-పాస్ యంత్రం ద్వారా మాత్రమే అమ్మకాలు జరగాలని ఆదేశించారు.ఎరువుల మొత్తం నిల్వలు,వినియోగ వివరాలతో సమగ్ర నివేదికను తక్షణమే ఇవ్వాలని జిల్లా వ్యవసాయ అధికారిని ఆదేశించారు. ఏవైనా కొరతలు ఉంటే, వెంటనే ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య అధికారి సిద్దప్ప, జిల్లా వ్యవసాయ అధికారి సక్రియ నాయక్, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు సంగీతలక్ష్మి, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.