calender_icon.png 13 May, 2025 | 8:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దందా బంద్!

12-05-2025 01:55:00 AM

  1. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట 
  2. వేబిల్లులు లేకుండా..ఓవర్‌లోడ్ నివారణకు చర్యలు 
  3. ఇసుక తరలించే వాహనాలకు జీపీఎస్ విధానం 
  4. ప్రతీ ఇసుక రీచ్‌ల వద్ద సీసీ కెమెరాలు 
  5. అందుబాటులోకి వచ్చిన ఇసుక ధరలు 
  6. సర్కార్‌కు ఆదాయం పెంచే దిశగా టీజీఎండీసీ

హైదరాబాద్, మే 11 (విజయక్రాంతి): ఇసుక అక్రమ తవ్వకాలు, ఇసుక రవాణాతో పాటు విక్రయాల్లో జరిగే అక్రమా లకు అడ్డుకట్ట వేసేందుకు టీజీఎండీసీ ముందుకెళ్లుతోంది. వేబిల్లులు లేకుండా ఇసుక అక్రమ రవాణా, ఓవర్ లోడ్‌తో ఇసుకను తరలించకుండా నిరంతరం నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించ డంతో..టీజీఎండీసీ ప్రక్రియను వేగవం తం చేసింది.

అందులో భాగంగానే ఇసుకను తరలించే వాహనాలకు జీపీఎస్ విధానాన్ని పకడ్బందీగా అమలుచేస్తోం ది. దీంతోపాటు ఇసుక రీచ్‌ల వద్ద లారీ ల్లో అధిక లోడ్ వేయకుండా నియంత్ర ణ చర్యలు చేపట్టింది. గతంలో మాదిరి గా వాహనంలో ఇసుక లోడు చేయగా, అదనంగా రెండు, మూడు బకెట్లను లారీల్లో వేసుకుని..ఆ ఇసుకను బయట అధికధరకు విక్రయించేవారు.

ఒక్కో లారీకి రెండు, మూడు బకెట్ల ఇసుక ఆదనంగా వేయడమంటే..రోజుకు వందల లారీలు ఇలా అదనంగా వేయడం వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లేది. ఇప్పుడు అలాంటి చర్యలు జరగకుండా రెవెన్యూ సిబ్బంది, పోలీసులు, రవాణా శాఖ అధికారులతో కలిసి టీజీఎండీసీ ఎప్పటికప్పుడు పటిష్టమైన చర్యలు తీసుకోవడంతో, ఇసుక ధరలు వినియోగదారులకు అందుబాటులోకి రావడ మే కాకుండా.. సర్కార్ ఖజానాకు అదనంగా ఆదాయం సమకూరుతోందని సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు.

చెక్‌పోస్టుల విస్తృత వద్ద తనిఖీలు

ఇసుక రీచ్‌ల వద్ద సీసీ కెమెరాలతో టీజీఎండీసీ నిఘాపెంచి..ఇసుక విక్రయాలను చేపడుతోంది. ఇసుక బజార్ల వద్దకు ఇసుకను తీసుకొచ్చే వాహనాలకు జీపీఎస్ యంత్రాలను అమర్చి వాటిని నిరంతరం ట్రాక్ చేయడంతో పాటు ఆ వాహనాల్లో ఎంత ఇసుక ఉంది.. ఇసుక బజారుకు వచ్చేసరికి తగ్గిందా..? పెరిగిందా..? అన్న విషయాలను ఎప్పటికప్పుడు రిజిష్ట్రర్‌లో నమోదు చేసుకుంటున్నారు.

అందుకు టీజీఎండీసీ అదనపు సిబ్బందిని కూడా నియమించింది. అంతేకాకుండా చెక్‌పోస్టుల్లోనూ తనిఖీలు చేస్తున్నారు. దీంతో ఓవర్‌లోడ్, వేబిల్లులు లేకుండా చేసే ఇసుక దందాకు దాదాపుగా అడ్డుకట్ట పడింది. గతంలో ఇసుక డీడీల కొనుగోలు కోసం పోటీపడి..అధిక ధరలకు కొనుగోలు చేసేవారు.

ప్రస్తుతం ఇసుక బజార్‌లు సమృద్ధిగా ఇసుక అందుబాటులో వస్తోంది. దీంతో రీచ్‌లు, ఇసుక బజార్ల నుంచి ఇసుకను కొనుగోలు చేయడానికి బిల్డర్లు, రియల్టర్లు, ప్రజలు, లారీడ్రైవర్లు ముందుకు వస్తున్నారు. దీంతో ఇసుక బజారులో సన్న ఇసుక టన్నుకు రూ.1,800 దొడ్డు ఇసుకకు రూ.1,600లకు టీజీఎండీసీ విక్రయిస్తోంది. 

కాగా, ఇంటి వద్దకే ఇసుక విక్రయిస్తామని చెప్పిన విధంగానే టీజీఎండీసీ అందుకు సంబంధించిన చర్యలు చేపట్టడంతో 24రీచ్‌ల నుంచి ప్రజలు ఇసుకను కొనుగోలు చేయడానికి టీజీఎండీసీ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఇసుక బజార్‌లు, ఇసుక రీచ్‌ల నుంచి డైరెక్ట్‌గా ఇసుక విక్రయాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి వివిధ పద్ధతులను టీజీఎండీసీ అవలంబిస్తోంది.

దీంతోపాటు ఇంటికే ఇసుక కావాలంటే వాహనాన్ని కూడా ఆ సంస్థ సమకూర్చుతోంది. 200 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరానికి రూ.3.75 పైసలు, 200 కిలోమీటర్ల కంటే తక్కువ దూరానికి కిలోమీటర్‌కు రూ.4.25 చొప్పున రవాణా చార్జీలను ఆ సంస్థ వసూలు చేస్తోంది. ఇలా నూతన విధానాలను అమలు చేస్తూ టీజీఎండీసీ వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.1,200 కోట్ల ఆదాయం ఆర్జించడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది.