17-05-2025 06:47:34 PM
జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్..
కొనుగోలుదారుల రద్దీ దృష్టా మరిన్ని వసతులు ఏర్పాటు..
నిర్ణీత గడువులోగా వీధి వ్యాపారుల ప్రాంగణం అభివృద్ధి పనులు పూర్తి చేయాలి..
ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా మార్కెట్ ను పరిశుభ్రంగా ఉంచుకోవాలి..
ఖమ్మం (విజయక్రాంతి): జిల్లా కేంద్రమైన ఖమ్మం నగరంలోని పాతబస్టాండ్ ఎదురుగా ఉన్న వీధి వ్యాపారుల ప్రాంగణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను శనివారం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్(District Collector Muzammil Khan) ఆకస్మికంగా తనిఖీ చేశారు. మౌళిక వసతుల కల్పనలో రాజీపడకుండా ప్రజలకు ఆసౌకర్యం కలగకుండా వీధి వ్యాపారుల ప్రాంగణం అనువుగా ఉండే విధంగా అభివృద్ది పనులు చేపట్టామని తెలిపారు. కూరగాయలు అమ్మే షెడ్ లు, స్టాల్స్, చూస్తూ ప్రాంగణం మొత్తం కలియతిరుగుతూ వ్యాపారులతో ముచ్చటించారు.
మార్చి 12న కలెక్టర్, వీధి వ్యాపారాల ప్రాంగణం ఆకస్మికంగా తనిఖీ చేసిన సందర్భంగా కూరగాయల వ్యాపారులు తమకు సరిపడా షెడ్లు లేవని, కొంతమంది వ్యాపారులు పట్టాలు కట్టి వ్యాపారం చేసుకుంటున్నామని, లైటింగ్ విద్యుత్ స్వీచ్ బోర్డు ఏర్పాటు చేయాలని, వర్షాలు పడితే ప్రాంగణం బురదతో నీళ్లు నిలిచిపోతాయని, వ్యాపారులకు రెండు టాయిలెట్ కావాలని సమస్యలను కలెక్టర్ దృష్టి తీసుకువచ్చారు. క్షుణ్ణంగా సమస్యలు తెలుసుకున్న కలెక్టర్ తక్షణమే స్పందించి, సమస్యలకు పరిష్కారం చేస్తామని హమీ ఇచ్చి యుద్ధప్రతిపాదన పనులు మొదలు పెట్టారు. వీధి వ్యాపార ప్రాంగణంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు మార్కెట్ మధ్య వరుసలో ఏర్పాటు చేస్తున్న రెండు షెడ్ లు, వర్షం నీరు పోయే విధానం, టాయిలెట్ నిర్మాణ పనులను మున్సిపల్ అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు.
నిర్ణీత గడువులోగా చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తి చేయాలని, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని నాణ్యత ప్రమాణాల ప్రకారం నిర్మాణాలు చేపట్టాలని, అభివృద్ధిలో ఎక్కడ రాజీ పడకుండా ప్లాన్ ప్రకారం పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.నిర్మాణ పనులను సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. మార్కెట్ వ్యాపారులు, కొనుగోలుదారులకు సౌకర్యవంతంగా ఉండేలా కావాలసిన అభివృద్ధి పనులు చేపట్టామని, వీటిని సైతం త్వరితగతిన నాణ్యతతో పూర్తిచేసి అందుబాటులోకి తీసుకొని రానున్నట్లు తెలిపారు. మనం ఆరోగ్యంగా ఉండాలంటే చెత్త, కూరగాయల వ్యర్ధాలు ఉండకుండా జాగ్రత్తలు, నియమాలు తీసుకొని మార్కెట్ శుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట మున్సిపల్ ఇఇ కృష్ణలాల్, సంబందిత అధికారులు తదితరులు ఉన్నారు.