calender_icon.png 2 August, 2025 | 8:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు

24-07-2025 08:24:11 PM

మందమర్రి (విజయక్రాంతి): ఎరువులను డీలర్లు  అధిక ధరలకు అమ్మిన, ఇతర వస్తువులు కలిపి అమ్మిన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా వ్యవసాయ అధికారి ఛత్రు నాయక్(District Agriculture Officer Chatru Naik) తెలిపారు. గురువారం మండలంలోని పలు ఫెర్టిలైజర్ ఎరువుల దుకాణాలను, గోదాములను వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం, ఆదిల్ పేట గ్రామంలోని మూలికా ఫెర్టిలైజర్స్ ఎరువుల దుకాణాలను, గోదాములను జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఛత్రు నాయక్, సహాయ వ్యవసాయ సంచాలకులు బానోత్ ప్రసాద్, మండల తహశీల్దార్ సతీష్ కుమార్, పట్టణ అదనపు ఎస్ఐ నూనె శ్రీనివాస్ లు ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి ఛత్రు నాయక్ మాట్లాడుతూ, ప్రతి ఎరువుల దుకాణం నందు స్టాకు నిలువలు, ధరల పట్టిక రైతులకు కనపడేలా తప్పనిసరిగా ప్రదర్శించాలని సూచించారు. ఈ వానా కాలం సీజన్ గాను రైతులకు కావలసినవి అందుబాటులో ఉంచాలని డీలర్లకు సూచించారు. వ్యవసాయ సాగు కొరకు మాత్రమే యూరియా అమ్మాలని, పారిశ్రామిక ప్రయోజనాలకు అమ్మకూడదని తెలిపారు. రైతులతో మాట్లాడుతూ, యూరియా ,ఇతర ఎరువుల లబ్ధిత గురించి, వాటి ధరల గురించి అడిగి, రైతులకు ఇబ్బంది లేదని తెలుసుకున్నారు.

రైతులు యూరియా, ఎరువుల కొరకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఈ వానాకాలం సీజన్ కు గాను సరిపడా స్టాక్ ను జిల్లా వ్యవసాయ శాఖ ద్వారా ఎప్పటికప్పుడు తెప్పించడం జరుగుతుందని తెలిపారు. రైతులు అధిక మోతాదులో ఎరువులను వాడి, పంట భూములను నిస్సారం చేయకూడదని సూచించారు. అదేవిధంగా రైతులు నానో యూరియా, నానో డిఏపి ల పైన మొగ్గు చూపించాలన్నారు. అదేవిధంగా ప్రతి పట్టాదారు సంబంధిత వ్యవసాయం విస్తరణ అధికారి వద్ద ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి జి కిరణ్మయి, వ్యవసాయ విస్తరణ అధికారి ముత్యం తిరుపతి, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ గణపతి లు పాల్గొన్నారు.