calender_icon.png 12 December, 2025 | 12:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శాంతిభద్రతకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు

11-12-2025 12:00:00 AM

స్వేచ్ఛగా ఓటు హక్కు  వినియోగించుకోవాలి ఎస్పీ శరత్ చంద్ర పవార్ 

నకిరేకల్, డిసెంబర్ 10 (విజయ క్రాంతి): జిల్లాలో నేడు జరగనున్న తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, నిస్పక్షపాతంగా నిర్వహించేందుకు పటిష్ఠ బందోబస్తు చేపట్టామని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ఎన్నికల రోజు శాంతిభద్రతకు భంగం కలిగించే  కఠిన చర్యలు తీసుకుంటామని  హెచ్చరించారు. 

బుధవారం కట్టంగూర్ ఎంఎస్‌ఆర్ ఫంక్షన్ హాల్లో ఎన్నికల సామగ్రి పంపిణీని పరిశీలించిన అనంతరం, బందోబస్తుకు నియమించిన పోలీసు అధికారులు, సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ  ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునేలా అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పారు.

అక్రమాలు, అనవసర గుంపుల ఏర్పాట్లు, డబ్బుసరుకుల ప్రలోభాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమస్యాత్మక గ్రామాల్లో అదనపు బందోబస్తు, మొబైల్ టీమ్‌లు అందుబాటులో ఉంటాయని ఆయన వెల్లడించారు. పోలింగ్ కేంద్రాల 100 మీటర్ల పరిధిలో 163 (బి.ఎన్.ఎస్. ఎస్) యాక్ట్ను కఠినంగా అమలు చేస్తామని, ఓటర్లు తప్ప ఇతరులను అనుమతించబోమని చెప్పారు.

ఓటర్లు మొబైల్ ఫోన్లు, ఇంక్ బాటిల్స్, హానికర వస్తువులు తీసుక రావద్దని ఆయన తెలిపారు. పోలీస్ అధికారులు, సిబ్బంది ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు లోబడి అప్రమత్తంగా పని చేయాలని సూచించారు. పోలింగ్ రోజు ఏదైనా ఘటన చోటుచేసుకుంటే రూట్ మొబైల్ టీములు క్షణాల్లో స్పందించేలా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.

ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు, మొబైల్ రూట్లపై ఉన్న అధికారులకు ప్రత్యేక సూచనలు జారీ చేశారు. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించరాదని స్పష్టం చేస్తూ, శాంతిభద్రతకు భంగం కలిగిస్తే తక్షణమే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో నల్లగొండ డీఎస్పీ కొనలు శివరం రెడ్డి, వన్టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి, కట్టంగూర్ ఎస్‌ఐ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.