08-01-2026 12:23:45 AM
మహిళా కానిస్టేబుల్ చేతికి తాళాలు
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్, జనవరి7 (విజయక్రాంతి): జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఫిర్యాదుల పెట్టెలను సమర్థవంతంగా, పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. స్నేహిత కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో ఫిర్యాదులు పెట్టెల నిర్వహణపై స్టేషన్ హౌస్ ఆఫీసర్లు, మహిళ కానిస్టేబుళ్లు, సిడిపివోలు, ఎంఈవోలు, హెడ్మాస్టర్లు, చైల్ ఫ్రెండ్లీ టీచర్లతో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంతో కలిసి కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులూ ఎదురైనా ధైర్యంగా తెలియజేసేందుకు ఫిర్యాదుల పెట్టే విధానాన్ని ప్రవేశపెట్టామని తెలిపారు.
లైంగిక వేధింపుల నుండి విద్యార్థులను కాపాడేందుకు ఈ ఫిర్యాదుల పెట్టెలు ఉపకరిస్తాయని తెలిపారు. జిల్లా యంత్రాంగం నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం ప్రతి పాఠశాలలో ఫిర్యాదుల పెట్టెలు నిర్వహించాలని ఆదేశించారు. ఫిర్యాదులు పెట్టెలపై విధిగా హెల్ప్ లైన్ నెంబర్లు ఉండాలని అన్నారు. పోలీస్, మహిళాభివృద్ధి శిశు సంక్షేమ, విద్య శాఖలు సమన్వయంతో ఈ ఫిర్యాదుల పెట్టెలు నిర్వహించాలని అన్నారు. వీటికి సంబంధించిన తాళాలు మహిళా పోలీసుల చేతిలో ఉంటాయని తెలిపారు.
మహిళా పోలీసులు పాఠశాలల సందర్శించి ఫిర్యాదులను సేకరించి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. చైల్ ఫ్రెండ్లీ టీచర్లు పిల్లలతో మమేకమై వారి ఫిర్యాదులను ధైర్యంగా తెలియజేసేలా ప్రోత్సహించాలని అన్నారు. స్నేహిత క్లబ్ మెంబర్లు ఉత్సాహంగా పనిచేసేలా చూడాలని తెలిపారు. పాఠశాల పరిధిలో తప్పిదాలు, నేరాలు, లైంగికపరమైన వేధింపులు జరిగినట్లు తమ దృష్టికి వస్తే ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు వెంటనే అధికారులకు తెలియజేయాలని అన్నారు. లేనిపక్షంలో అక్కడ జరిగే సంఘటనలకు వారు కూడా బాధ్యులై శిక్షార్హులవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, విద్యాశాఖ క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్ రెడ్డి పాల్గొన్నారు.