23-12-2025 12:00:00 AM
- గుర్రాలగుంది సర్పంచ్ ఆకుల స్వప్న హరీష్
సిద్దిపేట, డిసెంబర్ 22 (విజయక్రాంతి): గ్రామస్తుల సంపూర్ణ ఆరోగ్యానికి తన వంతు కృషి అందించి నిరంతరం సహకరిస్తానని నారాయణరావుపేట మండలంలోని గుర్రాలగొంది గ్రామ సర్పంచ్ ఆకుల స్వప్న హరీష్ అన్నారు. సోమవారం సర్పంచిగా పదవి బాధ్యతలు చేపట్టిన రోజున గ్రామంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య పరీక్షలు చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సర్పంచ్ గా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచే ప్రజలకు మెరుగైన సేవలందించాలనే లక్ష్యంతో గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశామని, తెలంగాణ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ అరవింద్ కుమార్, ఆద్య ఐ కేర్ హాస్పిటల్ డాక్టర్ మాధవిల సహకారంతో సుమారు 300 మందికి పైగా వైద్య పరీక్షలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు.
గ్రామంలోని ముగ్గురికి ఉచితంగా కంటి ఆపరేషన్ చేసేందుకు ఆధ్య ఆసుపత్రి వైద్యులు సహకరించారనీ చెప్పారు. భవిష్యత్తులో అన్ని విభాగాల ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యం అందించేందుకు కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమం విజయవంతానికి కృషి చేసిన ఎన్‌ఎస్‌ఎస్ శిబిరం ప్రోగ్రామ్ ఆఫీసర్ సాయికుమార్, వాలింటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ఆకుల హరీష్, ఎంపీఓ శ్రీనివాసరావు, ఏవో పరశురాం రెడ్డి, ఉపసర్పంచ్ కృష్ణ, వార్డు సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.