02-12-2025 01:03:21 AM
మొదటి విడత ఉపసంహరణ గడువు రేపే
కరీంనగర్, డిసెంబరు 1(విజయ క్రాంతి): గ్రామ సర్పంచ్ల ఎన్నికల మొదటి విడత నామినేషన్ల ఉపసంహరణ ఈ నెల 3 వరకు ఉంది. అభివృద్ధి కోసం ఎవరు ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తారో, వారిని సర్పంచ్గా ఎంచుకుంటామన్న విధంగా గ్రామస్తులు నిర్ణయిస్తున్నారని తెలుస్తోంది. దీంతో సర్పంచ్ పదవికి పోటీ భారీగా పెరిగింది. పార్టీలు ఏకగ్రీవాల కోసం ప్రత్యేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నా, వేలం పాటల ద్వారా ఏకగ్రీవాల ప్రయత్నాలు సాగుతున్నాయి.
గ్రామస్థుల అభిప్రాయ ప్రకారం, ఓటర్లకు డబ్బు, మద్యం పంపిణీ చేయడం కన్నా, అభివృద్ధికి సొంత నిధులు వెచ్చించి సర్పంచ్ కావడం బెటర్ అనే అభిప్రాయంతో కొందరు ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. గడచిన ఎన్నికల్లో సర్పంచ్గా పని చేసిన కొందరు తమ సొంత ఖర్చులతో గ్రామాభివృద్ధికి పనిచేశారు. అయితే ఆ ఖర్చులు ఇప్పటివరకు ప్రభుత్వం చెల్లించలేదనే ఆవేదనతో ఈ సారి ఖర్చు చేసె స్థితిలో లేము అవకాశం ఇవ్వండి అంటూ వేడుకుంటున్నారు. మరి కొందరు పోటీ దారులను మచ్చిక చేసుకొని విరమించే ప్రయత్నం చేస్తున్నారు.
తొలి విడతలో ఎన్నికలు జరుగుతున్న గ్రామపంచాయతీల్లో నామినేషన్ల పరిశీలన పూర్తయింది. మొదటి విడతలో కరింనగర్ జిల్లాలోఒక సర్పంచ్, మూడు వార్డు సభ్యుల నామినేషన్లను తిరస్కరించారు. 92 సర్పంచు పదవులకు 463 మంది అభ్యర్థులు, 866 వార్డులకు 1939 మంది అభ్యర్థులు ఉన్నారు. గంగాధర మండలంలోని మల్లాపూర్ పంచాయతీ సర్పంచ్ పదవి ఎస్సీ రిజర్వుడ్ కాగా ఆ గ్రామానికి చెందిన రాధ నామినేషన్ వేశారు.
ఎస్సీ వర్గానికి చెందిన ఆమె ముస్లిం యువకుడిని వివాహం చేసుకుంది. రాధ ముస్లిం యువకుడిని ఆ మత ఆచారం ప్రకారం వివాహం చేసుకున్నదని, దీంతో ఆమె బీసీ కేటగిరీ కిందకు వస్తుందని ఆమె ప్రత్యర్థులు రిటర్నింగ్ అధికారికి ఆధారాలు చూపుతూ ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె నామినేషన్ను తిరస్కరించారు. ఆమె సోమవారం తిరిగి అప్పీలు చేసుకున్నారు.
- దేశాయిపేట ఏకగ్రీవం..
చొప్పదండి మండలం దేశాయిపేట గ్రామపంచాయతీలోని సర్పంచ్ పదవితో సహా ఎనిమిది వార్డులకు సింగిల్ నామినేషన్ రావడంతో ఏకగ్రీవమయ్యింది. ఏకగ్రీ వానికి అనుకూలంగా గ్రామస్థుల నిర్ణయం మేరకు సర్పంచ్ పదవికి వడ్లకొండ తిరుమల మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. వార్డు సభ్యులకు శశిధర్, పద్మ, తార, నరసయ్య, రేణుక, ప్రవీణ్ రెడ్డి, గంగరాజు, శిరీష మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు.
అయితే వీరు వేలం పాట ద్వారా ఎన్నికయినట్టు ప్రచారం జరుగుతోంది. గంగాధర మండలంలో 66 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. కరీంనగర్ రూరల్ మండలం లో 25 వార్డులకు సింగిల్ నామినేషన్లు వ చ్చాయి. కొత్తపల్లి మండలంలో ఐదు వార్డులకు సింగిల్ నామినేషన్లు వచ్చాయి.
నామి నేషన్లు వేసిన వారు అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవడానికి డిసెంబరు 3న మ ధ్యాహ్నం 3 గంటల వరకు అనుమతిస్తారు. ఉపసంహరణ గడువు ముగిసిన వెంటనే పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. డిసెంబరు 11న తొలి విడత ఎన్నికలు జరుగుతాయి. అదేరోజు ఓట్లు లెక్కించి ఫలితాలనుప్రకటిస్తారు.