23-10-2025 10:50:47 PM
పశుసంవర్ధక శాఖ రాష్ట్ర సంచాలకులు డా.బి.గోపి..
చిట్యాల (విజయక్రాంతి): పశువులకు టీకాలు వేయించి, గాలికుంటు వ్యాధి రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రతి రైతు సహకారం అందించి కృషి చేయాలని పశువైద్య, పశుసంవర్ధక శాఖ రాష్ట్ర సంచాలకులు డా.బి.గోపి ఐఏఎస్ అన్నారు. గాలికుంటు వ్యాధి ఆవులు, గేదెలకు సోకే ఒక వైరల్ వ్యాధి అని, చికిత్స కన్నా టీకా ద్వారా నివారణే పరిష్కారం అవుతుందని ఆయన అన్నారు. గురువారం చిట్యాల మండలం పిట్టంపల్లి గ్రామంలో ఉన్న పశు వైద్యశాలను ఆయన సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏటా రెండు సార్లు గాలికుంటు ఉచిత నివారణ టీకాలు పశువైద్య, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఏడవ విడతగా ఈనెల 15 నుండి వచ్చే నెల 14 వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని, పాడి రైతులు, పశుపోషకులు సద్వినియోగం చేసుకొని క్రమం తప్పకుండా తమ పశువులకు టీకాలు వేయించాలని అన్నారు. గాలికుంటు వ్యాధి రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రతి రైతు సహకారం అందించాలని అన్నారు.
ఒక్కసారి గాలికుంటు వ్యాధి నిర్మూలన జరిగి తదనుగుణంగా మన దేశానికి గుర్తింపు వస్తే మన పాడి, పశు ఉత్పత్తులకు అంతర్జాతీయ గిరాకి పెరుగుతుందని, ఎగుమతులు పెరిగి తద్వారా మన రైతుల ఆర్థిక వ్యవస్థ మెరుగు పడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారి డా.జి.వి. రమేశ్, చిట్యాల పశువైద్యాధికారి డా.వి. అభినవ్, డా. జె.అమరేందర్, రాష్ట, జిల్లా అసోసియేషన్ సభ్యులు, పారా సిబ్బంది పి.శ్రీను, సైదులు, శ్రీనివాస్, మల్లారెడ్డి, వెంకన్న, సునీత, సతీష్ గోపాలమిత్రులు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.