25-07-2025 12:07:47 AM
జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్
గద్వాల టౌన్, జూలై 24 : ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యంతో చదువుతూ,అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ అన్నారు.గురువారం గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో హెల్పింగ్ హ్యాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ,విద్యార్థులు చదువుపై నిబద్ధతతో శ్రద్ధ చూపితే ఏ లక్ష్యమైనా చేరుకోవచ్చని అన్నారు. విద్యార్థులు ఉపాధ్యాయులు,తల్లిదండ్రుల మాటలను పాటిస్తూ క్రమశిక్షణతో కష్టపడి చదివితే,ఉన్నత స్థాయికి చేరగలరని అన్నారు. ఒక చిన్న గ్రామం నుంచి చదువుతోనే ఐఏఎస్ స్థాయికి చేరినట్టు పేర్కొంటూ,ఎక్కడి నుంచి వచ్చామన్నది కాదు కన్న కలలను కృషితో విజయాన్ని సాధించాలన్నారు.
గతేడాది రాష్ట్రంలో 32వ స్థానంలో ఉన్న గద్వాల జిల్లా,ఈ సంవత్సరం 26వ స్థానానికి చేరి 10.36% మెరుగుదల సాధించినట్లు తెలిపారు. పదవ తరగతి విద్యార్థుల కోసం లాంగ్వేజ్ మెటీరియల్ రూపొందించి అందించిన హెల్పింగ్ హాండ్స్ కలెక్టర్ హర్షం వ్యక్తం చేసి,ట్రస్ట్ చైర్మన్ రత్నసింహారెడ్డిని అభినందించారు. ఈ మెటీరియల్ను ఉపయోగించి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హ్యాండ్స్ చారిటీ ట్రస్ట్ చైర్మన్ రత్న సింహ రెడ్డి,మండల విద్యాధికారి శ్రీని వాసులు గౌడ్, ప్రధానోపాధ్యాయులు రేణుక దేవి, ట్రస్ట్ సభ్యులు,ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.