23-10-2025 08:27:28 PM
డిఐఈఓ బాను నాయక్..
నూతనకల్/ఆత్మకూరు యస్ (విజయక్రాంతి): ఇంటర్ వార్షిక పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయాలని సూర్యాపేట డిఐఈఓ భాను నాయక్ తెలిపారు. మండల పరిధిలోని నిమ్మికల్ ప్రభుత్వ కళాశాలను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అధ్యాపకులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధించడానికి ఇప్పటినుంచే వారికి కావాల్సిన మెటీరియల్ అందించాలన్నారు.ప్రతి విద్యార్థి ప్రతిరోజు కళాశాలకు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. క్లాస్ ఇన్చార్జులు ప్రతి తరగతిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని తరగతులకు హాజరు కాని విద్యార్థులను ఫోన్ ద్వారా సంప్రదించి కళాశాలకు రప్పిన్చాలన్నారు. ఇంటర్ విద్యా కమిషనర్ కృష్ణ ఆదిత్య ఆదేశాల ప్రకారం యుడైస్, ఎంఆర్హెచ్ పూర్తికాని విద్యార్థులకు పరీక్ష ఫీజులను తీసుకునేది లేదని తేల్చి చెప్పారు. ప్రతి విద్యార్థి హాజరు శాతం 70 ఉండాలని లేనియెడల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటారని వివరించారు.
కళాశాలకు వచ్చిన విద్యార్థులను సాయంత్రం వరకు చదివించాలని సూచించారు. హాజరుకాని విద్యార్థుల పట్ల అధ్యాపకులు శ్రద్ధ తీసుకోవాలన్నారు.కళాశాలలో డిజిటల్ పాఠాలు బోధించేందుకు ప్రత్యేకంగా సైన్ బోర్డులను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ప్రతి అధ్యాపకుడు కళాశాల అభ్యున్నతి కోసం మంచి ఫలితాలు తీసుకురావడానికి కృషి చేయాలని కోరారు. త్వరలో కళాశాల పరిధిలోని 9వ తరగతి పదవ తరగతి చదివే విద్యార్థులతో మమేకం కావడానికి అధ్యాపకులను పాఠశాలల వారీగా నియమిస్తామని చెప్పారు. కళాశాల ప్రిన్సిపాల్ పర్యవేక్షణలో ప్రతి పాఠశాలకు వెళ్లి విద్యార్థుల వివరాలు సేకరించాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి అనుకూలంగా విద్యార్థులను కళాశాల రప్పించేందుకు వారితో మమేకం కావాలని కోరారు.ప్రభుత్వ కళాశాల అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను ఇంటర్నెట్ బోర్డ్ కమిషనర్ సెక్రెటరీ చెప్పిన విధంగా కళాశాలలను అభివృద్ధి చేయాలని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో అధ్యాపకులు,తదితరులు పాల్గొన్నారు.