25-07-2025 12:49:21 AM
హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్
హనుమకొండ టౌన్, జులై 24 (విజయ క్రాంతి): ఆరెపల్లిలోని గిరిజన ఆశ్రమ గురుకుల బాలుర పాఠశాలను జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల తరగతి గదులను పరిశీలించారు.
విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాలను పరిశీలించారు. తరగతులు సందర్శన సందర్భంగా విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడగా తమకు మరికొన్ని పాఠ్య పుస్తకాలు రావాల్సి ఉందని విద్యార్థులు చెప్పడంతో వెంటనే పాఠ్య పుస్తకాలు అందించాలని ఎంఈవో ను ఆదేశించారు. మెనూ ఎలా ఉంటుందని విద్యార్థులను కలెక్టర్ అడి గారు. స్టోర్ రూంలో ఉన్న నిత్యావసరాలను తనిఖీ చేశారు.
పలు రికార్డులను కలెక్టర్ తనిఖీ చేశారు. భోజనశాలలో విద్యార్థులకు వండిన అన్నం, కూరలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ స్టోర్ రూమ్ లో సరిపోను నిత్యావసరాలను అందు బాటులో ఉంచాలన్నారు. కూరగాయలను ఎక్కువగా ఉండేలా చూసుకోవాలని, విద్యార్థులకు అందించే భోజన పదార్థాలు తాజాగా, వేడిగా, రుచికరంగా ఉండాలని వార్డెన్ ను ఆదేశించారు.
విద్యార్థుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి ప్రేమకళ, దామెర ఎంపీడీవో కల్పన, ఏటిడివో రూపాదేవి, ఏవో నాగసాగర్, ప్రధానోపాధ్యాయుడు సురేందర్ రెడ్డి, వార్డెన్ శ్రీనివాస్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు