07-05-2025 10:46:03 PM
జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే...
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకుని సాధించే దిశగా పట్టుదలతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే(District Collector Venkatesh Dhotre) అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులను ఉమ్మడి ఆదిలాబాద్ శాసనమండలి సభ్యులు దండే విఠల్ తో కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... మారుమూల మండలాల నుండి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో చదివి అత్యుత్తమ ఫలితాల సాధనకు కృషి చేసిన పాఠశాలల ఉపాధ్యాయులను అభినందించారు.
10వ తరగతి ఫలితాలలో జైనూర్ మండలం రాసి మెట్ట ఆశ్రమ పాఠశాల విద్యార్థిని సెడ్మకి అపర్ణ 547 మార్కులు, మండల కేంద్రంలోని బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థిని ఆత్రం కాసుబాయి 534 మార్కులు, రాసి మెట్ట ఆశ్రమ పాఠశాల విద్యార్థిని ఆత్రం నిర్మల 534 మార్కులు, కెరమెరి మండలం హట్టి బాలుర ఆశ్రమ పాఠశాల విద్యార్థి వైద్యనాథ్ 519 మార్కులు సాధించడం అభినందనీయమని అన్నారు. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు భవిష్యత్తులో ఏకాగ్రతతో కృషిచేసి ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి రమాదేవి, ఏ సి ఎం ఓ ఉద్దవ్, జి సి డి ఓ శకుంతల, క్రీడల అధికారి మీనారెడ్డి, విద్యార్థులు, తల్లిదండ్రులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.