04-07-2025 12:55:38 AM
సంగారెడ్డి, జూలై 3 (విజయక్రాంతి): పాశమైలారం సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన భారీ పేలుడు ఘటనపై నలుగురు సభ్యులతో కూడిన అధ్యయన కమిటీ గురువారం ఫ్యాక్టరీని సందర్శించింది. సిగాచి పేలుడు ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడమే కాకుండా అధికారికంగా 40 మంది మృత్యువాతపడ్డారు. మరో పదిమంది ఆచూకీ లభించలేదు. ఈ ఘటనపై స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫ్యాక్టరీని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.
బాధితులను ఓదార్చి వారికి అన్ని విధాలా ఆదుకుంటామని భరోసానిచ్చారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో పలు పరిశ్రమల్లో అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని భావించి నిపుణులతో కూడిన అధ్యయన కమిటీని ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే అధ్యయన కమిటీ రంగంలోకి దిగింది.
కమిటీ చైర్మన్ వేంకటేశ్వరరావు, సభ్యులు ప్రతాప్, సంతోష్, సూర్యనారాయణ బృందం ఫ్యాక్టరీలో పేలుడు ఘటన వివరాలను తెలుసుకున్నారు. ప్రమాదానికి కారణాలు ఏమిటో లోతుగా పరిశీలించారు. పలు శాంపిళ్లను సేకరించినట్టు తెలిసింది. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి నెలరోజుల్లో సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేయనున్నట్టు సమాచారం.