28-07-2025 12:33:58 AM
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
భద్రాద్రి కొత్తగూడెం, జులై 27: (విజయక్రాంతి)కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రానికి అవసరమైన యూరియాను సరఫరా చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర అన్నారు. ఆగస్టు నెల అవసరాలను తీర్చేందుకు రాష్ట్రానికి అదనంగా మూడు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించాలని కేంద్ర ఎరువుల శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా కు లేఖ వ్రాసినట్లు ఆయన తెలిపారు.
ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐడిఓసి కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలోని రైతులకు యూరియా అందకపోవడం వల్ల తీవ్ర సంక్షోభం నెలకొనడంతో, కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణలో ఖరీఫ్ పంటల సాగు ఉద్ధృతంగా సాగుతున్న నేపథ్యంలో, ఆగస్టు 2025 నెలలో యూరియా వినియోగం 3 లక్షల మెట్రిక్ టన్నుల (LMTs)కు పైగా ఉండే అవకాశం ఉందని తెలిపారు.
ఈ నేపథ్యంలో, కేంద్ర ఎరువుల శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా కు లేఖ రాసిన తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్రానికి అదనంగా మూడు లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించాలన్నారు. ఇప్పటికే జూన్, జూలై నెలల్లో యూరియా సరఫరా తక్కువగా ఉండటంతో, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని లేఖలో స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 1.16 కోట్ల ఎకరాల పంటలలో ముఖ్యంగా వరి, పత్తి, మక్క వంటి ప్రధాన పంటలకు యూరియా అత్యంత అవసరమని పేర్కొన్నారు.
ప్రస్తుతం రాష్ట్రం వద్ద 1.45 లక్షల మెట్రిక్ టన్నుల మాత్రమే మిగిలి ఉండగా, ఏప్రిల్ నుండి జూలై 2025 మధ్య కాలంలో 2.37 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా లోటు నమోదైనట్టు తెలిపారు. ఈ లోటు వల్ల సాగు ప్రక్రియకు అంతరాయమయి పంట దిగుబడి నాణ్యతపై ప్రభావం చూపే ప్రమాదం ఉందన్నారు.
ఈ పరిస్థితుల్లో రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకొని, అవసరమైన యూరియాను సమయానికి సరఫరా చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి ఇప్పటివరకు అందించిన సహాయానికి కేంద్రానికి కృతజ్ఞతలు తెలుపుతూ,
రైతులకు మద్దతుగా మరింత సహకారం అందించాలని లేఖలో కోరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రత్యేకాధికారి సురేంద్రమోహన్, ఖమ్మం పార్లమెంటు సభ్యులు రామ సహాయం రఘురామ రెడ్డి, పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.