calender_icon.png 2 October, 2025 | 2:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక సంస్థల ఎన్నికలకు సహకరించాలి

02-10-2025 12:14:34 AM

రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో కలెక్టర్ దివాకర టి.ఎస్. 

ములుగు, అక్టోబరు1 (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహిం చేందుకు రాజకీయ పార్టీలు తమ వంతు సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. కోరారు. బుదవారం జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. తన ఛాంబర్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశాలపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శ కాలను తు.చ తప్పక పాటిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలతో పాటు, గ్రామ పంచాయతీ ఎన్నికలను రెండు విడతలలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

ఎన్నికల షెడ్యూల్ వెలువడినందున రాజకీయ పార్టీలకు సంబంధించిన వాల్ రైటింగ్, ఫ్లెక్సీలు, హోర్డింగులు, ఫోటోలను ప్రభుత్వ కార్యాలయాల్లో 24 గంటల వ్యవధిలో, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, పెట్రోల్ బంక్ తదితర ప్రదేశాలలో 48 గంటల వ్యవధిలో, అనుమతి లేని ప్రైవేట్ స్థలాలలో 72 గంటల వ్యవధిలో పూర్తి స్థాయిలో తొలగించాలన్నారు.

అక్టోబర్ 9 న నోటిఫికేషన్ వస్తుందని, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫేజ్  I ఎన్నికలకు సంబంధించి అక్టోబర్ 9 వ తేదీ నుండి 11 వ తేదీ వరకు ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరించడం జరుగుతుందని, అక్టోబర్ 23న మొదటి విడత పోలింగ్ జరుగుతుందని తెలిపారు. 

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫేజ్  II ఎన్నికలకు సంబంధించి అక్టోబర్ 13వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరించడం జరుగుతుందని, అక్టోబర్ 27 న రెండవ విడత పోలింగ్ జరుగుతుందని తెలిపారు. నవంబర్ 11న ఓట్ల లెక్కింపు నిర్వహించబడుతుందని అన్నారు.

ములుగు జిల్లా నందు.. 

గ్రామ పంచాయతీ ఫేజ్2 ఎన్నికలకు సంబంధించి అక్టోబర్ 21వ తేదీ నుండి 23వ తేదీ వరకు ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందని, నవంబర్ 4న మొదటి పోలింగ్ జరుగుతుందని తెలిపారు.  గ్రామ పంచాయతీ ఫేజ్3 ఎన్నికలకు సంబంధించి అక్టోబర్ 25వ తేదీ నుండి 27వ తేదీ వరకు ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరించడం జరుగుతుందని వివరించారు.

నవంబర్ 8న రెండవ విడత పోలింగ్ జరుగుతుందని తెలిపారు. మొదటి, రెండవ విడతలలోనూ ఉదయం 7.00 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు పోలింగ్ జరుగుతుందని, అనంతరం పోలింగ్ రోజునే మధ్యాహ్నం 2.00 గంటల నుండి కౌంటింగ్ జరిపి ఫలితాలు వెల్లడించడం జరుగుతుందని వివరించారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు పూర్తి సహకారం అందించాలని కోరారు.