calender_icon.png 1 October, 2025 | 3:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సహకరించాలి

01-10-2025 02:02:43 AM

రాజకీయ పార్టీల ప్రతినిధులకు జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ విజ్ఞప్తి

హైదరాబాద్,సిటీ బ్యూరో సెప్టెంబర్ 30 (విజయక్రాంతి ): త్వరలో జరగనున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికను స్వేచ్ఛాయుత వాతావరణం, పారదర్శకంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలన్నీ సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ విజ్ఞప్తి చేశారు. ఉప ఎన్నిక సన్నాహాల్లో భాగంగా మంగళవారం జీహెఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆయన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.

భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించిన తుది ఓటరు జాబితాను విడుదల చేసినట్లు ప్రకటించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఓటరు జాబితా ప్రతులను అందజేశారు. ఓటర్లు తమ పేరు, పోలింగ్ కేంద్రం వివరాలను అధికారిక వెబ్‌సైట్ల ద్వారా, ఓటర్ హెల్ప్‌లైన్ యాప్, నేరు గా కార్యాలయంలో గానీ చూసుకోవచ్చని తెలిపారు. కొన్ని కొత్త పోలింగ్ కేంద్రాలు ఏర్పడినందున, పాత ఓటర్లలో కొందరిని సమీపంలోని కేంద్రాలకు మార్చినట్లు తెలిపారు. 

ఓటు నమోదుకు ఇంకా అవకాశం

అర్హత ఉండి ఓటరుగా నమోదు చేసుకోని వారికి ఇంకా అవకాశం ఉందని కమిషనర్ తెలిపారు. జులై 1, 2025 నాటికి 18 ఏళ్లు నిండిన యువత ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఓటరు జాబితాలో అభ్యంతరాలు, మార్పులు, చేర్పుల కోసం ఫారం-7, ఫారం-8 ద్వారా నామినేషన్ల స్వీకరణ చివరి తేదీ వరకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉందని స్పష్టం చేశారు. సమావేశంలో జోనల్ కమిషనర్ రవి కిరణ్‌తో పాటు ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.