calender_icon.png 8 August, 2025 | 3:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిజిస్ట్రేషన్లపై నిఘా!

08-08-2025 12:32:29 AM

-భూముల అక్రమ రిజిస్ట్రేషన్లపై కలెక్టర్ సీరియస్

-నిషేధిత జాబితా భూముల రిజిస్ట్రేషన్ చేస్తే చర్యలు

కరీంనగర్, ఆగస్టు 7 (విజయ క్రాంతి): కరీంనగర్ జిల్లాలోని ముఖ్యంగా రేకుర్తి, కొత్తపల్లి, నగునూరు భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల బాగోతం ఒక్కొక్కటిగా బయటకు రావడం, కొత్తపల్లి భూముల విషయంలో లోకాయుక్త జోక్యం చేసుకోవడం, రేకుర్తి భూములకు సంబంధించిన 9 రిజిస్ట్రేషన్ల విషయంలో గంగాధర సబ్ రిజిస్ట్రార్ సస్పెండ్ కు గురికావడంతో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అక్రమ రిజిస్ట్రేషన్ల అడ్డుకట్టకు ప్రత్యేక దృష్టిసారించారు.

గతంలో చెక్ పెట్టడానికి పలు ప్రయత్నాలు జరిగినా దొడ్డిదారిన అక్రమ రిజిస్ట్రేషన్లు కొనసాగుతుండడంతో ఈసారైనా చెక్ పడేనా అన్నది కలెక్టర్ తీసుకునే కఠిన నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. కరీంనగర్ పట్టణానికి సమీపంలోని కొత్తపల్లి పరిధిలోని 175, 197, 198 సర్వే నెంబర్లలోని సీలింగ్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్లపై లోక్ సత్తా ఉద్యమ సంస్థ నేత దివంగత నరెడ్ల శ్రీనివాస్ చేసిన న్యాయ పోరాటం ఫలితంగా లోకాయుక్త ఆదేశాల మేరకు జూన్ మొదటి వారంలో గంగాధర సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో 476 రిజిస్ట్రేషన్లను కలెక్టర్ రద్దు చేసిన విషయం తెలిసిందే.

ఆ తర్వాత ఇటీవల అదే గంగాధర సబ్ రిజిస్ట్రార్ నూర్ అఫ్టల్తాన్ కొత్తపల్లి 272/14 సర్వే నెంబర్లో నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేసిన 9 డాక్యుమెంట్లను క్యాన్సిల్ చేశారు. తాజాగా బల్సియా 202 ఇంటి నెంబర్ల మీద ఎలాంటి రిజిస్ట్రేషన్లు చేయవద్దని కరీంనగర్, గంగాధర సబ్ రిజిస్ట్రార్లకు లేఖ రాయడంతో మరో 202 రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు చెల్లించకుండా పోయే పరిస్థితి ఏర్పడింది. ఈ విషయమై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు, తహసిల్దార్లు, మున్సిపల్ కమిషనర్లతో సమావేశం నిర్వహించారు.

నిషేధిత జాబితా భూములను రిజిస్ట్రేషన్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆ భూముల జాబితాను నవీకరించాలని, రెవెన్యూ, రిజిస్ట్రేషన్, మున్సిపల్ శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. తప్పుడు ధృవీకరణ పత్రాలు పరిశీలించకుండా రిజిస్ట్రేషన్ చేస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. జిల్లాలో ఇటీవల వరుసగా జరుగుతున్న రిజిస్టర్డ్ డాక్యుమెంట్ల రద్దు ఘటనలు, రిజిస్ట్రేషన్ల నిలుపుదల ఘటనలు సంచలనం సృష్టిస్తున్నాయి. అక్రమార్కుల్లో దడ పుడుతుందగా తెలియక కొనుగోలు చేసిన అమాయకులు ఆందోళన చెందుతున్నారు.