calender_icon.png 8 August, 2025 | 6:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

42శాతం అమలుకు మూడు మార్గాలు

08-08-2025 12:36:02 AM

  1.    50 శాతం సీలింగ్ పక్కన పెట్టి జీవో ఇవ్వడం 
  2. రెండోది స్థానిక సంస్థల ఎన్నికలు ఆపడం 
  3. మూడోది పార్టీపరంగా 42శాతం రిజర్వేషన్లు 
  4. మోదీ చేతుల్లోనే బీసీ రిజర్వేషన్  
  5. కేసీఆర్‌ను నేనెందుకు జైలులో వేస్తా..
  6. మీడియాతో చిట్‌చాట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడి 

హైదరాబాద్, ఆగస్టు 7(విజయక్రాంతి): కేంద్రం బీసీ బిల్లుకు ఆమోదించకపోతే.. స్థానిక సంస్థల ఎన్నికలపై ఎలా వెళ్లాలో ఆలోచిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడి అన్నారు. రిజర్వేషన్లు అమలు కోసం తమ వద్ద మూడు మార్గాలు ఉన్నాయని సీఎం వివరించారు. బీసీ రిజర్వేషన్ 42శాతం ఇవ్వాలన్నది తమ కమిట్మెంట్ అని ఆయన స్పష్టం చేశారు. రిజర్వేషన్ సాధన కోసం పూర్తిస్థాయిలో ప్రయత్నాలు చేశామని, కులగణన, రిజర్వేషన్ల సాధనలో తమ చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేరని సీఎం పేర్కొన్నారు.

ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో మీడియాతో సీఎం రేవంత్‌రెడ్డి చిట్ చాట్ చేశారు. రిజర్వేషన్లు అమలు కోసం తమ వద్ద మూడు మార్గాలు ఉన్నాయని సీఎం వివరించారు. “గత ప్రభుత్వం తీసుకొచ్చిన 50 శాతం సీలింగ్ పక్కన పెట్టి జీవో ఇవ్వాలి. జీవో ఇస్తే ఎవరైనా కోర్టుకు వెళితే స్టే వస్తుంది. జీవో ఇచ్చి ఎన్నికలకు వెళితే మొదటి మార్గం సాధ్యం కాదు. ఇప్పుడే స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టకుండా ఆపడం రెండో మార్గం.

స్థానిక ఎన్నికలు ఆపితే.. కేంద్రం నుంచి నిధులు రావు. కేంద్రం నిధులు ఆగితే గ్రామాల్లో వ్యవస్థ కుప్పకూలుతుంది. మూడో మార్గం పార్టీపరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఇతర పార్టీలపై ఒత్తిడి తీసుకొస్తాం” అని ఆయన స్పష్టం చేశారు. గ్రామస్థాయి నుంచి ప్రజల అభీష్టం మేరకే పార్టీ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.

మోదీ చేతుల్లోనే బీసీ రిజర్వేషన్

లోకల్ బాడీ ఎన్నికలను సెప్టెంబర్ 30 లోపు నిర్వహించాలని హైకోర్టు చెప్పిందన్నారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై రాష్ర్ట ప్రభుత్వంగా అన్ని విధాల ప్రక్రియ పూర్తి చేశామని తెలిపారు. “ప్రస్తుతం బీసీల రిజర్వేషన్  అంశం కేంద్రం, బీజేపీ  కోర్టులో ఉన్నది. బీసీలపై ప్రేమ ఉంటే.. బీసీ బిల్లును కేంద్రం ఆమోదించాలి. కేంద్రంపై ఒత్తిడి పెంచడం కోసం బీసీలకు న్యాయమైన వాటా కోసమే మా కొట్లాట.

జంతర్‌మంతర్ వేదికగా మా వాణీ బలంగా వినిపించాం. జంతర్ మంతర్ ధర్నాపై బీజేపీ, బీఆర్‌ఎస్ నేతల విమర్శలు విడ్డూరం. మా కమిట్‌మెంట్‌కు వాళ్ల సర్టిఫికేట్ అవసరం లేదు. ప్రజలకు అబద్ధపు మాటలు చెప్పి మభ్యపెట్టం. అది బీఆర్‌ఎస్ నైజం. మేము ఆ పని చేయలేం.

బీసీలకు రాహుల్ ఇచ్చిన మాటను అమలుచేడమే మా టార్గెట్. మోదీ చేతుల్లోనే బీసీ రిజర్వేషన్ నిర్ణయం ఉంది. మా ఆఖరి పోరాటాన్ని పూర్తిచేశాం. ఇక బీజేపీ నిర్ణయం తీసుకోవాలి. రాష్ర్టపతికి రాజకీయాలకు సంబంధం లేదు” అని అన్నారు.

కేసీఆర్‌ను నేనెందుకు జైలులో వేస్తా..

“కేసీఆర్ జైలులో ఉన్నట్టే ఫామ్‌హౌస్‌లో ఉన్నారు. కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు, చర్లపల్లి జైలుకు తేడా ఏముంది. కేసీఆర్‌ను ఓడించడమే పెద్ద శిక్ష. నేను విద్వేష రాజకీయాలు చేయడం లేదు. బీఆర్‌ఎస్ నేతలకు నైతికత గురించి మాట్లాడే అర్హత లేదు. బీహార్ ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఉండే అవకాశం ఉంది” అని సీఎం తెలిపారు.