22-09-2025 12:00:00 AM
సాహిత్య రంగంలో విమర్శ ఒక తులనాత్మక ప్రక్రియ. విమర్శ అంటే కేవలం రచన లేదా సంకలనంలోని తప్పులు వెతకడం కాదు. అలాగే అతిశయోక్తులతో కవులు, రచయితలను పొగడ్తలతో ముంచెత్తటమూ కాదు. నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, నిష్కర్షగా రచనను సమీక్షించే ప్రక్రియే విమర్శ. అలాంటి సమతుల్యమైన విమర్శనా దృష్టి ఉన్న తెలుగు సాహితీ విమర్శకుల్లో అగ్రగణ్యుడు ఆచార్య ఎస్వీ రామారావు.
వ్యక్తిగత అభిప్రాయాలకు తావు లేకుండా, సాహిత్యాన్ని సాంస్కృతిక చరిత్రతో అనుసంధానించి కవులు, రచయితల రచనలను ఆయన విమర్శించేవారు. ఆచార్య సూగూరు వెంకట (ఎస్వీ) రామారావు 1941 జూన్ 5వ తేదీన పాలమూరు (నేటి వనపర్తి) జిల్లా శ్రీరంగాపురంలో జన్మించారు. తల్లిదండ్రులు వాసుదేవరావు, రామచూడమ్మ. ఆ గ్రామం ప్రాచీన సాంస్కృతిక సంప్రదాయాలకు నిలయంగా ఉండేది.
తన స్వగ్రామంలోనే రామారావు ప్రాథమిక విద్యసాగింది. వనపర్తి ఉన్నత పాఠశాలలో తదుపరి పాఠశాల విద్య పూర్తయింది. రామారావు కుటుంబంలో సాహిత్య వాతావరణమేమీ లేకపోయినప్పటికీ ఆయనలో సాహిత్యాభిలాష పెరగడానికి కారణం.. నాటి భౌగోళిక, చారిత్రక, సామాజిక పరిస్థితులే. వనపర్తి, జటప్రోలు, ఆత్మకూరు, గద్వాల వంటి ప్రాంతాలు నాడు సాహిత్య సంస్కృతి వికాసానికి నిలయాలుగా ఉండేవి.
అలాంటి సాహిత్య పోషక వాతావరణంలో జన్మించడం రామారావులో సాహిత్యాభిలాషకు పునాది వేసింది. రెండో ప్రపంచ యుద్ధకాలంలో పుట్టారు. చిన్నవయస్సులోనే ఆయనపై జాతీయోద్యమ ప్రభావం ఉండేది. ప్రాథమిక పాఠశాల విద్యార్థిగా ఉన్నప్పుడే ఆయన త్రివర్ణ పతాక బ్యాడ్జీలు ధరించి ర్యాలీల్లో పాల్గొన్న అనుభవం రామారావుకు ఉంది.
విస్తారమైన పఠనం.. అధ్యయనం..
రామారావు విద్యార్థి దశలోనే సాహిత్య పఠనం ఆయనలో రచనా చైతన్యాన్ని మేల్కొల్పింది. ‘గురువులకన్నా ముందే నేను చదివిన పుస్తకాల గురించి మాట్లాడగలిగేవాడిని’ అని ఆయన స్వయంగా చెప్పుకొనేవారు. ఈ వ్యాఖ్య ఆయన సాహిత్యాసక్తి ఎంత లోతైనదో తెలియజేస్తుంది. వనపర్తి హైస్కూల్‌లోని గ్రంథాలయం ఆయన అభిరుచికి మెరుగులద్దింది.
15 ఏళ్ల వయస్సులోనే ఆయన కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ ‘ఏకవీర’, బుచ్చిబాబు ‘చివరకు మిగిలేది’, గోపిచంద్ ‘అసమర్థుని జీవయాత్ర’ వంటి మైలురాయి స్థాయి నవలలను చదివారు. ప్రత్యేకంగా ‘ఏకవీర’, ‘చివరకు మిగిలేది’ ఆయన మనసుపై చెరగని ముద్ర వేశాయని చెప్పుకొనేవారు. తన జీవన తాత్విక దృష్టినీ ప్రభావితం చేశాయని ఉద్ఘాటించేవారు. అందుకే ఆయన వాటినే తన సాహిత్య గురువులని చాటిచెప్పేవారు.
సైన్స్, జాగ్రఫీ సబ్జెక్టుల్లో రామారావు అంతగా రాణించేవారు కాదు. కానీ, తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌లో ఆయన ప్రావీణ్యం గొప్పగా ఉండేది. రామారావు సాహిత్య అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించినది విస్తారమైన గ్రంథ పఠనం. చిన్నతనం నుంచే ఆయన ‘చందమామ’, ‘బాలపత్రిక’ ద్వారా కథా లోకంలోకి ప్రవేశించారు. తరువాత ‘ఆంధ్రపత్రిక’, ‘ఆంధ్రప్రభ’ పఠనం ద్వారా సమకాలీన చింతనతో మమేకమయ్యారు.
ఆయన అభిరుచుల్లో సినిమా కూడా ఒక భాగం. ‘గుణసుందరి కథ’, ‘సంసారం’, ‘షావుకారు’ వంటి సినిమాలను విమర్శనాత్మక దృష్టితో చూడాలని ఆయన ఆ కాలంలోనే చెప్పేవారు. సినిమాలపై ‘ఆంధ్రపత్రిక’, ‘ఆంధ్రప్రభ’లో వచ్చిన సమీక్షలను చదివడంతో ఆయనకు సినిమాలపై విమర్శ రాయాలనే తపన కలిగింది. 14- 15 సంవత్సరాల వయస్సులోనే ఆయన సినిమాలపై సమీక్షలు రాసి మద్రాస్ నుంచి వెలువడే పత్రికలకు పంపించేవారు.
ధనికొండ హనుమంతరావు సంపాదకత్వంలో వచ్చే ‘చిత్రసీమ’, ‘సినిమా రంగం’ వంటి పత్రికల్లో ఆయన సమీక్షలు అచ్చయ్యాయి. ఒక మారుమూల గ్రామానికి చెందిన విద్యార్థి రచనలు మద్రాస్ నుంచి వచ్చే పత్రికల్లో ప్రచురితమవ్వడం నాడు ఒక సంచలనం. రామారావు సాహిత్య రచన ఆరంభం సినిమా సమీక్షలతోనే మొదలైంది. సినిమాలను విమర్శనాత్మక దృష్టితో చూడటం అలవాటైన రామారావుకూ తెలుగు సాహిత్యాన్నీ విమర్శనాత్మకంగా చూడటం అబ్బింది. ఆ దశే ఆయన్ను భవిష్యత్తు విమర్శకుడిగా ఎదిగేందుకు పునాది వేసింది.
ఎన్నో కీలకమైన బాధ్యతలు..
1958లో రామారావు హైదరాబాద్‌లోని నిజాం కళాశాలలో పీయూసీ చేరారు. తర్వాత ఇదే కాలేజీలో బీఏ పూర్తి చేశారు. తెలుగు మీడియం విద్యార్థి అయినప్పటికీ, నిజాం కళాశాలలో ఇంగ్లిష్ మాధ్యమంలో పీయూసీ చదివి, ఇంగ్లిష్‌లో అత్యధిక మార్కులు సాధించడం ఆయన ప్రతిభను ప్రతిఫలింపజేస్తుంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాలలో ఎంఏ (తెలుగు) పూర్తిచేశారు.
సాహిత్య రంగంలో ఆసక్తి ఉన్న రామారావును ఆ తపనే ఆయన్ను విద్యావంతుడిగా, సాహిత్య పిపాసిగా తీర్చిదిద్దింది. డాక్టర్ నారాయణరెడ్డి పర్యవేక్షణలో ఆయన ‘తెలుగు సాహిత్య విమర్శ - అవతరణ వికాసాలు’ అనే అంశంపై పరిశోధన పూర్తి చేశారు. 1973లో పీహెచ్‌డీ పట్టా పొందారు. అదే సంవత్సరంలో భారతీయ విద్యాభవన్ నుంచి జర్నలిజంలో డిప్లొమా సాధించారు. 1966లో అధ్యాపకుడిగా ఎస్వీ రామారావు తన బోధనా ప్రస్థానాన్ని ప్రారంభించారు.
బోధనలో తనదైన ప్రతిభ చూపి కేవలం ఒక దశాబ్దంలోనే రీడర్‌గా ఉద్యోగోన్నతి పొందారు. ఆయనలోని సృజనాత్మకత, పరిశోధనా దృష్టి 1987లో ఆయన్ను ఉస్మానియా వర్సిటీకి ప్రొఫెసర్‌ను చేసింది. తెలుగు సాహిత్య రంగ అభివృద్ధి కోసం ఆయన తెలుగుశాఖ అధ్యక్షుడిగా, బోర్డ్ ఆఫ్ స్టడీస్ డైరెక్టర్‌గా, ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ డీన్ వంటి ఎన్నో కీలక పదవులు అలంకరించారు. కేంద్రియ విశ్వవిద్యాలయం,
కాకతీ య విశ్వవిద్యాలయం, బెనారస్ హిందూ యూనివర్సిటీ, బెంగళూరు యూనివర్సిటీ వంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో విజిటింగ్ ప్రొఫెసర్‌గా సేవలందించారు. దేశవ్యాప్త సాహిత్య సదస్సులు, జాతీయ అంతర్జాతీయ సదస్సులకు ప్రాతినిధ్యం వహించి అనేక పరిశోధనా పత్రాలు సమర్పించారు. నాటి విద్యార్థుల కోసం 1వ తరగతి నుంచి ఎంఏ స్థాయి వరకు పాఠ్య గ్రంథాల రచన, సంపాదకత్వంలో కీలక పాత్ర పోషించారు.
2001 ఏప్రిల్‌లో ఆయన పదవీవిరమణ చేశారు. రామారావు జీవితంపై అత్యంత ప్రభావం చూపినవారు జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సీ నారాయణరెడ్డి. పీయూసీ చదువుతున్న సమయంలోనే రామారావు ఆయన శిష్యుడయ్యారు. సీ నారాయణ రెడ్డి కూడా రామారావుపై ప్రత్యేకమైన మమకారం చూపేవారు. ‘రామారావు నాకంటే పదేళ్లు చిన్నవాడు. నా దగ్గరే చదువుకున్నాడు. నా వద్దనే పీహెచ్‌డీ పూర్తి చేశాడు. నా వెంటే వస్తున్నాడు’ అని నారాయణరెడ్డి ఎంతో గర్వంగా చెప్పుకునేవారు.
పరిశోధనా ప్రస్థానం..
రామారావు విమర్శనా దృష్టి ఆరంభానికీ మూలం ఆయన నిజాం కళాశాల విద్యార్థి దశ. ఆ సమయంలోనే ఆయన రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ, విశ్వనాథ సత్యనారాయణ వంటి మహత్తర విమర్శకుల రచనలు, వ్యాసాలను అధ్యయనం చేశారు. ఆ పఠనం ప్రభావంతోనే పీయూసీ చదువుతున్నప్పుడే ఆయనలో సాహిత్య విమర్శపై పీహెచ్‌డీ చేయాలనే కోరిక మేల్కొన్నది. రామారావును ఆ రంగంలో ఖండవల్లి లక్ష్మీ రంజనం, దివాకర్ల వెంకటావధాని, డాక్టర్ సీ నారాయణరెడ్డి వంటి ప్రముఖులు ఎంతో ప్రోత్సహించారు. సీ నారాయణరెడ్డి చెంత మొట్టమొదటి పీహెచ్‌డీ విద్యార్థిగా మారడం రామారావు జీవితంలో గొప్ప మలుపు.
ఆయన ఎంచుకున్న పరిశోధనాంశం ‘తెలుగులో సాహిత్య విమర్శ - అవతరణ వికాసాలు’ (1973). తెలుగు సాహిత్యంలో అప్పటివరకు ఎవరూ అంతలోతైన అంశం తీసుకున్న దాఖలాలు లేవు. విమర్శనా గ్రంథ రచన కోసం ఆయన సంపూర్ణ తెలుగు సాహిత్యాన్ని అభ్యసించారు. ‘మంచి, చెడు తెలుసుకోవాలంటే మొత్తం సాహిత్యం అధ్యయనం చేయాలి’ అనేది రామారావు సిద్ధాంతం.
ఆ జిజ్ఞాసే ఆయనలోని పరిశోధనా దృష్టికి పునాది వేసింది. సాధారణంగా పరిశోధకులు 4- ఏళ్లలో పీహెచ్‌డీ పూర్తి చేస్తారు. కానీ, రామారావు 7 సంవత్సరాల పాటు పరిశోధన చేశారు. వేటపాలెం, రాజమండ్రిలోని, మద్రాసు యూనివర్సిటీ గ్రంథాలయాలు, తంజావూర్ సారస్వత మహల్ లాంటి ప్రసిద్ధ గ్రంథాలయాలన్నింటినీ జల్లెడ పట్టారు. ఎన్నో విమర్శనా గ్రంథాలు, పత్రికలను సేకరించారు.
సుదీర్ఘకాలం పాటు పరిశోధన చేసి చివరకు ‘తెలుగులో సాహిత్య విమర్శ’ అనే సిద్ధాంత గ్రంథాన్ని వెలువరించారు. ఇది తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి ఏకైక విమర్శనాత్మక చరిత్ర గ్రంథం. గ్రంథంలో తెలుగు సాహిత్యరంగంలో విమర్శ ఆరంభం, 19వ శతాబ్దపు తొలి విమర్శ గ్రంథాలు, తొలి నాటక, -నవలా విమర్శలు, అలాగే ఆధునిక విమర్శకులైన విశ్వనాథ సత్యనారాయణ, రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ వంటి మహనీయుల కృషిని సమగ్రంగా పరిచయం చేశారు.
అప్పటి నుంచి గ్రంథం విశ్వవిద్యాలయాల్లో పాఠ్యగ్రంథంగా, పరిశోధకులకు మార్గదర్శకంగా స్థిరపడింది. ఇప్పటివరకు ఇది అనేక సవరణలతో పునః ముద్రితమైంది. ఈ పుస్తకాన్ని ‘నా జీవిత సాఫల్య గ్రంథం’గా ఆయన పేర్కొన్నారు. అంతటి సాహితీ కృషీవలుడు ఈ నెల 17న తుదిశ్వాస విడిచారు. ఆయన్ను ఆదర్శంగా తీసుకుని సాహిత్యరంగంలో మరింతమంది విమర్శకులు వస్తే బాగుంటుందనేది ఆయన అభిలాష. ఆ ఆకాంక్ష సాకారం కావాలని కోరుకుందాం.