calender_icon.png 21 November, 2025 | 3:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సన్నాల వరి సాగుకు సై!

16-08-2024 02:28:16 AM

  1. ఆశలు రేపిన సర్కార్ రూ.500 బోనస్ ప్రకటన 
  2. కామారెడ్డి జిల్లాలో 40 రకాలకు పైగా సాగు 
  3. దొడ్డు రకాలపై విముఖత

కామారెడ్డి, ఆగస్టు 15 (విజయక్రాంతి): రైతుల ఆలోచనల్లో మెల్లగా మార్పు వస్తోం ది. వ్యవసాయం ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది. సాగులో అన్నదాతలు వినూత్న పద్ధతులను అవలంబిస్తున్నారు. దీనిలో భాగంగా రైతులు దొడ్డు రకం వరి సాగుకు స్వస్తి పలికి సన్న రకాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. కామారెడ్డి జిల్లావ్యాప్తంగా యాసంగిలో 92 లక్షల ఎకారాల్లో రైతులు సన్న రకాల వరి రకాలు సాగు చేశారు. వానకాలంలోనూ సుమారు 1.12 లక్షల ఎకారాల విస్తీర్ణంలో వరి సాగు కానున్నది. రైతు భరోసాలో భాగంగా సన్న రకం వడ్లకు ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇవ్వనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో రైతులు సన్న రకం సాగుపై దృష్టి సారిస్తున్నారు.

ప్రభుత్వం ప్రోత్సహించడంతోనే..

జిల్లాలో 40 రకాలుకు పైగా సన్న రకాలు సాగవుతున్నాయి. ప్రధానంగా ఎంటీయూ 1224, 1271, 1282, ఏజిఎల్ 1798, హెచ్‌ఎంటీ సోనా, కేఎన్‌ఎం 1638, బీపీటీ 5204, ఆర్‌ఎన్ ఆర్  (తెలంగాణ సోనా)తో పాటు ప్రైవేట్ విత్తన కంపెనీలకు చెందిన జై శ్రీరాం, కావేరి చింటూ, జీ నెక్స్ చిట్టిపొట్టి, ధనిష్ట సూపర్ ఆమన్, సౌభాగ్య, అన్నపూర్ణ, బయోసిడ్ పల్లవి అంకుర్, ఆమని, ఆమోఘ్ తదితర రకాలు రైతులు సాగుచేస్తున్నారు. వీటిలో ఎంటీయూ  1271, 1282, ఆర్‌ఎన్‌ఆర్  15048 రకాలకు డిమాండ్ ఉంది. ఈ రకాలు జిల్లాల్లో సుమారు 33 వేల ఎకరాల్లో సాగు అవుతుండడం విశేషం. రేషన్ దుకాణాల్లోనూ త్వరలో సన్న బియ్యం పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లోనూ సన్నబియ్యం వండి పెడుతున్న నేపథ్యంలో ఈ సీజన్ లో ఇబ్బడి ముబ్బడిగా సన్న రకాల సాగు పెరిగింది.

మార్కెట్ లో భలే డిమాండ్

బహిరంగ మార్కెట్‌లో ప్రస్తుతం సన్న బియ్యానికి మంచి డిమాండ్ ఉంది. క్వింటా వడ్లకు రూ.2,500 నుంచి 3,200 వరకు ధర పలుకుతుండగా, సన్న రకం పాత బియ్యానికి క్వింటాల్‌కు రూ.5,500 8,000 వరకు ధర ఎగబాకింది. కొందరు వడ్లు కొన్ని మిల్లులో పట్టించి బియ్యం విక్రయించొచ్చనే అభిప్రాయంతో ఉన్నారు. ఈ సీజన్‌లో బోర్లు, బావుల కింద వరి నాట్లు మొదలు కాగా చెరువులు కుంటల కింద రైతులు నారు పోశారు. పలువురు నాట్లు వేయించకుండా కాకుండా వెదజల్లే పద్ధతిలో సాగు చేస్తున్నారు. 

సన్నరకం వరి సాగుకే రైతుల మొగ్గు

గత సీజన్‌లో కంటే ఈ సీజన్‌లో రైతులు ఎక్కువగా సన్నరకం వరి సాగు కే మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.500 బోనస్ ప్రకటించడంతో సన్న ధాన్యం సాగుకు డిమాం డ్ పెరిగింది. ఎకరాకు 30 క్వింటాళ్ల ధాన్యం వచ్చినా రూ.15 వేలు అదనంగా ఆదాయం వస్తుంది. ప్రభుత్వ  ప్రోత్సాహకం కలిసి వస్తుందని రైతులు ఆశిస్తున్నారు. 

 భాగ్యలక్ష్మి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, కామారెడ్డి

ఖర్చులు ఎక్కువైన బోనస్ కలిసి వస్తుందని సాగు

యాసంగిలో సన్నరకాల సాగు మరీ తక్కువగా ఉంటుండగా వానకాలంలో సాధరాణంగా సాగు విస్తీర్ణంలో 40 శాతం సన్న రకాల వడ్లు సాగవుతాయి.దొడ్డు వడ్ల వెరైటిలతో పోలుస్తే సన్నరకం వరి సాగుకు పెట్టుబడి అధికమవుతుంది.సన్న రకాలకు తెగుళ్లు,చీడ పీడల భాధ ఎక్కువగా ఉంటుండగా  నివారణ,నియంత్రణ కోసం పురుగుల మందులు స్ప్రే చేయా ల్సి ఉంటుంది. దొడ్డు రకం వరి దిగుబడుతో పోలిస్తే సన్నరకాలు తక్కువ దిగుబడినిస్తాయి. అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వ్యయప్రయాసాల కోర్చి సన్న రకం ధాన్యాలు సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు.ప్రభుత్వం సన్నరకాల ధాన్యంకు రూ.500 బోనస్ ప్రకటించడం వల్ల సన్నరకం ధాన్యం సాగువైపు మొగ్గు చూపుతున్నాం. 

 ఆకుల లింగం, రైతు, అడ్లూర్‌ఏల్లారెడ్డి, కామారెడ్డి జిల్లా