calender_icon.png 13 May, 2025 | 4:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమ నిర్మాణాలపై తహసీల్దార్ కొరడా

13-05-2025 12:15:19 AM

పటాన్ చెరు, మే 12 :ప్రభుత్వ భూముల రక్షణే ధ్యేయంగా అమీన్ పూర్ రెవెన్యూ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు.  రాత్రికి రాత్రి ప్రభుత్వ భూముల్లో చేపడుతున్న అక్రమ కట్టడాలను నేలమట్టం చేస్తూ కారకులపై కేసులు నమోదు చేస్తూ కబ్జాదారుల గుండెల్లో దడ పుట్టిస్తున్నారు.

అమీన్ పూర్ తహసీల్దార్ గా వెంకటస్వామి బాధ్యతలు  తీసుకున్న తరువాత ప్రభుత్వ భూముల్లో అక్రమ కట్టడాలు జరగకుండా తగు చర్యలు తీసుకుంటున్నారు. రాత్రికి రాత్రి నిర్మాణాలు జరిగినట్లు ఫిర్యాదులు వచ్చిన వెంటనే  రెవెన్యూ, మున్సిపల్ సిబ్బందితో వెళ్లి పోలీసుల సహకారంతో జేసీబీలతో కూల్చివేస్తున్నారు.

తహసీల్దార్ గా బాధ్యతలు తీసుకున్న రెండు రోజులకే 993 సర్వేనంబర్ ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలను కూల్చివేయించారు. ఏప్రిల్ 11వ తేదీ సుల్తాన్ పూర్ రెవెన్యూ పరిధిలోని సర్వేనంబర్ 30లో,  కిష్టారెడ్డి పేట పరిధిలోని సర్వేనంబర్ 164లో, పటేల్ గూడ పరిధిలోని సర్వేనంబర్ 12లో అక్రమ నిర్మాణాలను కూల్చివేయించారు.  మే ఒకటిన సర్వేనంబర్ 993లో నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించారు.

3వ తేదీన అమీన్ పూర్ పరిధిలోని సర్వేనంబర్ 455లో అక్రమ నిర్మాణాలను, బెస్మేంట్లను నేలమట్టం చేయించారు. అలాగే సుల్తాన్ పూర్ పరిధిలోని సర్వేనంబర్ 381లో పలు ఇండ్లు, బెస్మేంట్లను కూల్చివేయించారు. సోమవారం అమీన్ పూర్ పరిధిలోని సర్వేనంబర్ 993, 994లో రాత్రికి రాత్రి నిర్మించిన పలు ఇండ్లు, బేస్మేంట్లను జేసీబీలతో తహసీల్దార్ కూల్చివేయించారు. ప్రభుత్వ భూముల్లో తరుచూ అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్న వారిని గుర్తించి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తహసీల్దార్ వెంకటస్వామిహెచ్చరించారు.