calender_icon.png 6 July, 2025 | 3:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రకరకాల రుచులతో టీ గ్లోబ్స్

01-06-2025 12:00:00 AM

ఉదయం లేవగానే నీళ్లు తాగేవాళ్ల కన్నా టీ తాగేవాళ్ల సంఖ్యే అధికం. ఎక్కడో పుట్టి.. ప్రపంచమంతా ఆవరించేసింది తేనీరు. ఒకప్పుడు టీ అంటే పాలు, చక్కెర, కాస్త డికాషన్.. కానీ ఇప్పుడు? టీ అంటే ఒక విప్లవం. రంగులు, రూపాలు మార్చుకుంటూ ఎప్పటికప్పుడు తనను తాను అప్డేట్ చేసుకుంటున్నది.

టీ బ్యాగులు, రకరకాల పూల టీలు, గ్రీన్, బ్లాక్, వైట్.. ఎన్నో రంగుల్లో టీలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఇక తాజాగా ట్రెండ్ ‘బాంబులు’. హాట్ చాకొలేట్ బాంబుల్లాంటివే ఇవి కూడా. ఇన్‌స్టాలో ఇప్పుడు వీటిదే హవా. 

‘టీ గ్లోబ్’ అంటారో లేక ‘టీ బాంబులు’ అని పిలుస్తారో మీ ఇష్టం. చూడటానికి మాత్రం గుండ్రంగా ఉంటాయి. దాదాపు టీ బ్యాగుల్లాంటివే. కాకపోతే టీబ్యాగులను చివర్లో తీసి బయటపడేస్తాం కానీ వీటిల్లో మాత్రం బయటపడేందుకు ఏం మిగలదు. కనుక ఇవి ట్రావెల్ ఫ్రెండ్లీ.

క్కడికి కావాలంటే అక్కడికి సులువుగా తీసుకెళ్లొచ్చు. షుగర్, టీ పొడి ఈ టీ బాంబుల్లోనే ఉంటుంది. వీటిని గ్లాసులో వేసుకుని వేడి పాలు, లేదా నీళ్లు జతచేరిస్తే చాలు కరిగి కమ్మనైన టీగా మారిపోతాయి. ఆకర్షించే రంగుల్లో, రకరకాల ఫ్లేవర్లలో టీ బాంబులు లభిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే టీ ప్రియుల్లో పాకుతున్న తాజా ట్రెండ్ ఇది.

ఎన్ని ఫ్లేవర్లో..

ఇప్పటికే టీలో ఎన్నో ఫ్లేవర్లు అందుబాటులో ఉన్నాయి. చేమంతి పూలు, మందార పూలు, శంఖం పూలు, బంతిపూలు.. ఇలా ఔషధగుణాలున్న అనేక రకాల టీలు అందుబాటులో ఉన్నాయి. నిమ్మ, అల్లం, గ్రీన్ టీ వంటివి కూడా చాలామంది ఆస్వాదిస్తారు. టీబాంబుల్లో ఇలాంటి అన్ని ఫ్లేవర్లు దొరుకుతున్నాయి. చాలా సంస్థలు టీ బాంబుల అమ్మకాలను మొదలుపెట్టాయి.

గ్రీన్ టీ బాంబు, జింజర్ టీ బాంబ్, ఛమోలీ టీ బాంబు.. ఇలా అనేక రకాలు దొరుకుతున్నాయి. కాకపోతే ఇంకా మనదేశంలోని ఈకామర్స్ సైట్లలో అడుగుపెట్టలేదు. త్వరలో అందుబాటులోకి రానున్నాయి. అమెరికాలో టీ బాంబులే తాజా ఫుడ్ ట్రెండ్. వీటి అమ్మకాలు కూడా జోరుగా సాగుతున్నాయి. 

చేయడం సులువే!

టీ బాంబులను ఇంట్లో కూడా సులువుగా చేసుకోవచ్చు. ఇందులో చక్కెర, టీ పొడి, కార్న్ సిరప్ ఉంటే చాలు. ఒక గిన్నెలో చక్కర పాకం వచ్చేవరకు మరిగించి.. కార్న్ సిరప్ కలపాలి. ఆ మిశ్రమాన్ని గుండ్రటి మౌల్డ్‌లో వేయాలి. అది కాస్త చల్లారాక మెల్లగా మౌల్డ్ నుంచి రెండు అరకప్పులను వేరు చేసి టీ పొడి లేదా ఆకులు వాటి మధ్యలో వేసి రెండింటినీ ఒకదానిపై ఒకటి పెట్టి అతికించాలి.

చక్కెర పాకం పూర్తిగా చల్లారక ముందే మౌల్డ్ నుంచి తీస్తాం కాబట్టి.. అర కప్పులు రెండూ త్వరగానే ఒకదానికొకటి అతుక్కుంటాయి. టీ తాగాలనుకున్నప్పుడు వేడి నీరు లేదా పాలు చేర్చితే చక్కెర కరిగిపోయి టీ సిద్ధమైపోతుంది.