calender_icon.png 9 December, 2025 | 3:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్లోబల్ మోడల్‌గా తెలంగాణ

09-12-2025 02:27:58 AM

గ్లోబల్ సమ్మిట్ వేదికగా మంత్రి సీతక్క

హైదరాబాద్, డిసెంబర్ 8 (విజయక్రాంతి): ‘మహిళలు ఎదిగితే ఆర్థిక వ్యవస్థ ఎదుగుతుంది. మహిళలు స్వయం సంపత్తి సృష్టిస్తే అభివృద్ధి సమగ్రంగా ఉంటుంది. మహిళలు వ్యాపారాలు నడిపితే ఆర్థిక వృద్ధి స్థిరంగా ఉంటుంది. తెలంగాణ ఈ మార్పునకు నాయకత్వం వహిస్తోంది’ అని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. మహిళా ఆధారిత ఆవిష్కరణలతో ముందుకు సాగుతున్న తెలంగాణ రాష్ర్ట అభివృద్ధి గాథను, భవిష్యత్తు ప్రణాళిలను తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వేదికగా ఆవిష్కరించారు.

దేశంలోనే అత్యంత శక్తివంతమైన మహిళా నెట్‌వర్క్‌ను తెలంగాణ నిర్మించిందని, 65 లక్షల మహిళా స్వయం సహాయక సంఘాలు గ్రామీణ, పట్టణ ఆర్థిక వ్యవస్థలను పూర్తిగా మారుస్తున్నాయని పేర్కొన్నారు. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళలతోపాటు దివ్యాంగులు,  అట్టడుగు వర్గాలు, ట్రాన్స్‌జెండర్లకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని చెప్పారు. వడ్డీలేని రుణాలు, స్ట్రీ నిధి, బ్యాంకుల ద్వారా భారీ స్థాయిలో అందించిన క్రెడిట్ సపోర్ట్, లక్షలాది సూక్ష్మ వ్యాపారాల నెలకొల్పడం, ఇందిరా మహిళా శక్తి భవనాలు, తెలంగాణ మహిళల ఆర్థిక స్వరూపాన్ని మార్చేశాయని తెలిపారు.

ప్రతి మహిళకు ప్రమాద బీమా, లోన్ బీమా వంటి రక్షణ వలయాలు సమాన అవకాశాలు అందిస్తున్నాయని పేర్కొన్నారు. మహిళా శక్తి కాంటీన్లు ఆదాయ వనరులుగా మారాయని చెప్పారు. 32 జిల్లాల్లో మహిళల చేత ఏర్పాటు కాబోతున్న 64 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లు దేశంలోనే తొలి ఉదాహరణగా నిలిచాయని వెల్లడించారు. మహా లక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం మహిళల జీవితాల్లో విశేష మార్పు తెచ్చిందన్నారు.