10-08-2025 12:00:00 AM
- అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల నుంచి 15 వేల కోట్ల పెట్టుబడులకు ప్రణాళికలు
- పర్యాటక రంగంలో 3 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తాం
- 27 ప్రాంతాల్లో పర్యాటక కేంద్రాల ఏర్పాటు
- 2025 పర్యాటక పాలసీ అమలుకు రూట్ మ్యాప్
- నీటి పారుదల శాఖమంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
- లక్డీకపూల్‌లో సదరన్ ట్రావెల్స్ ప్రాంతీయ కార్యాలయం ప్రారంభం
హైదరాబాద్, ఆగస్టు 9 (విజయక్రాంతి): తెలంగాణను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూ పొందించామని రాష్ర్ట నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. దానికనుగుణంగా అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల నుంచి రూ.15 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభు త్వం ప్రత్యేక విధానాన్ని రూపొందించిందని తెలిపారు.
తద్వారా పర్యాటక రంగంలో 3 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామని వెల్లడించారు. శనివారం హైదరాబాద్‌లోని లక్డీకపూ ల్ వద్ద సదరన్ ట్రావెల్స్ ప్రాంతీయ కార్యాలయాన్ని సహచర మంత్రి పొన్నం ప్రభా కర్‌తో కలసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడు తూ.. ఈ సంవత్సరం మార్చి 17 నుంచి అమలులోకి వచ్చిన 2025- పర్యాటక రంగం పాలసీని అమలుచేసి అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణను నిలబెట్టడమే తమ ముందున్న లక్ష్యమని చెప్పారు.
ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటంతో పాటు పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించడం ఈ పాలసీలో భాగమని తెలిపారు. ప్రస్తుతం గుర్తింపు పొందిన పర్యాటక స్థలాల్లో మౌలిక సదుపాయాలను వృద్ధి చేయడం, జలపాతాలు, ఆధ్యాత్మిక కేంద్రా లు, వారసత్వంగా గుర్తింపు పొందిన ప్రాం తాలు, ఏకోటూరిజం కేంద్రాలు, వెల్‌నెస్ కేం ద్రాలతో పాటు క్రాఫ్ట్ గ్రామాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నామన్నారు.
ఇవిగాక మరో 27 ప్రాంతాల్లో పర్యాటక కేంద్రాల ఏర్పాటుకు రూట్ మ్యాప్ రూపొందించినట్టు వెల్లడించారు. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో తెలంగాణకు తలమానికంగా నిలిచిపోయేలా ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు, ప్రాంతీయ రింగ్ రోడ్ల వెంట డ్రై పోర్టులు, గోదావరి, కృష్ణా నదులపై రివర్ బెస్ట్ టూరిజం, నగరాలలో వాటర్ ఫ్రంట్ హబ్‌ల వంటి ప్రత్యేకతలతో కూడిన పర్యాటక కేంద్రాలను రూపొందించేందుకు రాష్ర్ట ప్రభుత్వం యోచిస్తోందన్నారు.
జాతీయ, అంతర్జాతీయ ట్రావెల్ సంస్థలు కుటుంబ సభ్యులతో నిర్వహించే యాత్రలకు తెలంగాణ కేంద్రంగా నిలిచేలా పాలసీని రూ పొందించినట్టు పేర్కొన్నారు. పర్యాటక కేంద్రాలను వేగవంతంగా పూర్తి చేసేందుకు రాయితీలు, ప్రోత్సాహకాలు అందించడమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక కేంద్రాల ప్రాముఖ్యతను వివరించి ప్రపంచస్థాయిలో నిలబడేలా చేయడం ప్రభుత్వ సంకల్పమని వివరించారు.
అందుకుగానూ పర్యాటక కార్యవర్గాన్ని నియమించి డెస్టినేషన్ మేనేజ్‌మెంట్ బోర్డు ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదించిందని వెల్లడించారు. భారతదేశంలో అత్యంత నమ్మకమైన నెట్‌వర్క్ కలిగి ఉండి యాత్రికుల మన్ననలు పొందిన సంస్థగా సదరన్ ట్రావెల్స్ పేరొందినదన్నారు. అటువంటి సంస్థ హైదరాబాద్ కేంద్రంగా ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించడం శుభ పరిణామంగా అభివర్ణించారు. ఇది రాష్ర్ట పర్యాటక రంగ అభివృద్ధికి దోహదపడుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు.
తాను రాష్ర్టపతి భవన్‌లో పనిచేస్తున్నపుడు ఈ సంస్థను దగ్గర ఉండి చూశానన్నారు. ఇప్పటికే ఢిల్లీ, జైపూర్, అమరావతిలలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ హైదరాబాద్‌లో ప్రాంతీయ కార్యాలయం ప్రారంభించడం ద్వారా రాష్ర్టంలో ప్రసిద్ధి చెందిన నాగార్జునసాగర్, రామప్ప, లక్నవరం వంటి పర్యాటక కేంద్రాల ప్రమోషన్‌కు ఉపకరిస్తుందన్నారు. పర్యాటక రంగంలో అభివృద్ధికి గాను రూపొందించిన పాలసీలో సదరన్ ట్రావెల్స్ భాగస్వామ్యం కావాలని నిర్వాహకులకు సూచించారు.