calender_icon.png 4 October, 2025 | 2:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పూడూరులో పండుగ వేడుకల్లో ఉద్రిక్తత

04-10-2025 12:00:00 AM

-రెండు గ్రూపులుగా విడిపోయిన సామాజిక వర్గాలు 

-ఉదయం నుంచి టెన్షన్, టెన్షన్ 

-భారీగా పోలీసు బలగాల మోహరింపు

మేడ్చల్, అక్టోబర్ 3 (విజయ క్రాంతి): మేడ్చల్ మండలం పూడూరు గ్రామంలో దసరా పండుగ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దసరా జండా ఎగరవేసే విషయంలో గ్రామంలోని సామాజిక వర్గాలు రెండు గ్రూపులుగా విడిపోయాయి. చివరకు గ్రామంలో దసరా జెండా ఎగురవేయలేదు. గ్రామంలో దసరా పండుగ రోజు జెండా ఎగురవేసి జమ్మి చెట్టుకు పూజ చేసి రావణ దహనం చేయడం ఆనవాయితీగా వస్తోంది.

పటేల్ పట్వారి కుటుంబానికి చెందిన మజ్జిగ సుధాకర్ రెడ్డి జెండాను ఎగురవేసేవారు. 2019లో సర్పంచ్ గా ఎన్నికైన బాబు యాదవ్ పటేల్ పట్వారి కుటుంబీకులు జెండా ఎగురవేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. పటేల్ పట్వారి వ్యవస్థ లేనందున ప్రజలచే ఎన్నికైన గ్రామ సర్పంచ్ చేత ఎగర వేయించాలన్నారు. దీనికి మజ్జిగ సుధాకర్ రెడ్డి కుటుంబీకులు అంగీకరించలేదు. దీంతో  ఓసి లు ఒక జెండా, బీసీ ఎస్సీ ఎస్టీలు మరో జెండా ఎగురవేశారు. ప్రతి సంవత్సరం దసరాకు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడేది. గత సంవత్సరం అప్పటి ఏసిపి శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి, తహసిల్దార్ శైలజ ఇరు వర్గాలతో చర్చించి సయోధ్యకుదురుచ్చారు.

పటేల్ పట్వారి వ్యవస్థ లేనందున ప్రజాప్రతినిధి, లేదా ప్రభుత్వ అధికారి జెండా ఎగరవేయాలని ఒప్పందం చేశారు. ప్రస్తుతం ప్రజా ప్రతినిధులు లేనందున తామే ఎగరవేస్తామని మజ్జిగ సుధాకర్ రెడ్డి కుటుంబీకులు ముందుకు రావడంతో వివాదం మొదలైంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలకు చెందిన వారిని బైండోవర్ చేశారు. జెండా ఎవరు ఎగరవేయవద్దని చెప్పారు. దీంతో జండా ఎగురవేయకుండా, రెండు వర్గాల వారు ఎవరికి వారు జమ్మి చెట్టుకు పూజ చేసి, రావణ దహనం చేశారు. 

గ్రామంలో భారీగా పోలీసు బలగాల మొహరింపు 

గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి ఉన్న నేపథ్యంలో పోలీసు బలగాలు భారీగా మోహరించారు. సిఐ సత్యనారాయణ గ్రామంలోనే ఉండి ఉదయం నుంచి ఇరు వర్గాలతో సంప్రదింపులు జరిపారు. ఏసిపి శంకర్ రెడ్డి గ్రామంలో పరిస్థితిని పరిశీలించారు.