16-05-2025 06:25:04 PM
భారీగా పోలీసుల మోహరింపు
అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు పంపిణీ చేయాలి
సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి
హుజురాబాద్,(విజయక్రాంతి): హుజురాబాద్‌లో గంటపాటు ఉద్రిక్తత కొనసాగింది. సిపిఐ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణ పరిధిలోని గణేష్ నగర్ లో గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సిపిఐ ఆధ్వర్యంలోర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని పట్టణ సిఐ టి కర్ణాకర్ ఆధ్వర్యంలో పోలీసులు అడ్డుకున్నారు. భారీగా పోలీసులు మొహరించి బందోబస్తు నిర్వహించారు. హుజురాబాద్ తాసిల్దార్ కనకయ్య ర్యాలీ వద్దకు చేరుకొని సిపిఐ నాయకుల నుండి వినతి పత్రం తీసుకొని నెల రోజుల లోపల నిరాశ్రయులైన నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ లో పంపిణీ చేస్తామని హామీ ఇవ్వడంతో సిపిఐ నాయకులు శాంతించారు.
ఈ సందర్భంగా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి, జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి మాట్లాడుతూ.. హుజురాబాద్ పట్టణంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను గత ప్రభుత్వం పంపిణీ చేయకపోగా. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్కు పలుమార్లు లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్న పట్టించుకోని పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం హుజురాబాద్ పట్టణంలో నిర్మించిన 570 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను తక్షణమే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం ఇటీవల మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్లలో నాలుగు చక్రాల వాహనాలు ఉంటే అనర్హులుగా ప్రకటించడం సోషనియమని అన్నారు. నెల రోజుల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అర్హులకు పంచని యెడల ఆందోళన కార్యక్రమాలు తీవ్రతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు సృజన్, అశోక్, రాజు, శ్రీనివాస్, మహిళా సమైక్య రాష్ట్ర నాయకురాలు మల్లక్క, జిల్లా కౌన్సిల్ సభ్యులు రామవరపు వెంకటేష్, శారద,లంక దాసరి కళ్యాణ్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.