calender_icon.png 5 July, 2025 | 5:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉగ్ర ఘాతుకం

24-04-2025 12:00:00 AM

పైన్ వృక్షాల అడవులు, కొండలపై నుంచి వచ్చే చల్లని గాలులు, పరుచుకున్న పచ్చని మైదానాలతోకూడిన బైసరన్ లోయ పర్యాటకులకు స్వర్గధామం. మినీ స్విట్జర్లాండ్‌గా పిలుచుకునే అనంత్‌నాగ్ జిల్లా పహల్గాం సమీపంలో వున్న ఈ లోయకు రాళ్లదారిలో నడిచి వెళ్లాల్సిందే. లేదంటే గుర్రాలపై వెళ్లవచ్చు. కశ్మీర్‌లో పర్యాటక సీజన్ ప్రారంభమవుతున్న రోజులివి. వేలసంఖ్యలో దేశవిదేశీ టూరిస్టులు ఇప్పటికే కశ్మీర్ చేరుకున్నారు.

తమకు ఇష్టమైన ప్రాంతాలను సందర్శిస్తున్నారు. ఇదే అదనుగా సాయుధ ముష్కరులు కశ్మీర్‌లో మరోసారి తెగబడ్డారు. బౌసరన్ లోయ పర్యాటకులను లక్ష్యంగా చేసుకొని నెత్తురు పారించారు. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబాకు అనుబంధంగా వున్న ‘ద రెసిస్టెన్స్ ఫ్రంట్’ (టీఆర్‌ఎఫ్) ఈ ఘాతుక దాడి జరిపినట్లు చెప్పుకొంది.

సైనిక దుస్తుల్లో ఏకె 47 రైఫిళ్లతో దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులు ఇటీవలే కశ్మీర్‌లో చొరబడి వుంటారని అనుమానిస్తున్నారు. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 ని రద్దు చేసిన తర్వాత టీఆర్‌ఎఫ్ ఏర్పడింది. ఆర్టికల్ 370 రద్దుతో స్థానికేతరులు కశ్మీర్‌లో ఆస్తులు కొని స్థానికుల మనుగడను దెబ్బ తీస్తారని ఈ సంస్థ మొదట్లో ఆన్‌లైన్‌లో ఉగ్రకార్యకలాపాలు సాగించింది.

తర్వాత లష్కర్ వంటి ఉగ్రవాద సంస్థలనుంచి సభ్యులను ఆకర్షించి సాయుధ గ్రూపుగా ఏర్పడిందని నిఘా వర్గాలు చెపుతున్నాయి. ఇప్పుడు బైసరన్‌లో దాడికి పాల్పడింది తామేనని చెబుతున్నా టీఆర్‌ఎఫ్‌కు సరిహద్దు ఆవలినుంచి పూర్తి సహకారం లభించి వుండవచ్చు. నిజానికి లష్కరే తోయిబా ఉగ్రకార్యకలాపాలవల్ల సమస్యలను ఎదుర్కొన్న పాకిస్థాన్ లష్కర్‌తోనే టీఆర్‌ఎఫ్‌ను ఏర్పాటు చేయించిందనే వార్తలు వచ్చాయి.

2019లో ఏర్పాటైన టీఆర్‌ఎఫ్ కశ్మీర్‌లో తన ఉనికిని చాటేందుకు ప్రయత్నిస్తోంది. 2023లో టీఆర్‌ఎఫ్‌ను ఉగ్రసంస్థల జాబితాలో భారత్ చేర్చింది. కశ్మీర్ ఉగ్రవాది షేక్ సజ్జాద్ గుల్ దీని సృష్టికర్త. సజ్జాద్ గుల్‌తోబాటు టీఆర్‌ఎఫ్‌లో పనిచేస్తున్న సాజిద్ జాట్, సలీం రెహ్మానీ గతంలో లష్కరే తోయిబాలో క్రియాశీలంగా ఉన్నట్టు నిఘా సంస్థ లు గుర్తించాయి. కశ్మీరీ పండిట్‌లు, వలస కార్మికులు, ఉద్యోగులను టార్గె ట్ చేసి ఐదేళ్లలో టీఆర్‌ఎఫ్ అనేక దాడులు చేసింది.

స్థానికేతరులు, హిం దువులు ఆ సంస్థకు టార్గెట్‌గా ఉన్నారని బైసరన్ దాడితో మరోసారి స్పష్టమైంది. గుర్తింపు కార్డులు చూసి, హిందువులా, ముస్లింలా తేల్చుకొని మరీ ఉగ్రవాదులు భార్యాబిడ్డల ఎదుటే పలువురిని కాల్చి చంపారు. కశ్మీర్ ఎప్పటికీ పాకిస్థాన్ జీవనాడిగానే వుంటుందని ఇటీవల పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఉగ్రసంస్థలకు కొత్త ఊపునిచ్చినట్లయింది.

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భార త్‌లో పర్యటిస్తున్న సందర్భం, ప్రధాని నరేంద్ర మోదీ సౌదీ పర్యటనకు వెళ్లడం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకొనే ఉగ్రవాదులు కశ్మీర్‌లో ఈ దాడికి పాల్పడి వుంటారు. ఈ దాడిని ప్రపంచ ప్రముఖులు ఖండించారు. 

భారత ప్రభుత్వం ఈ ఉగ్రదాడిని తీవ్రంగా పరిణమించింది. సౌదీ పర్యటనను అర్ధాంతరంగా ముగించుకొని వచ్చిన ప్రధాని మోదీ భద్రతా వ్యవహారాల కమిటీతో అత్యవసరంగా సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. వేసవి కాలం కశ్మీర్ పర్యాటక రంగానికి చాలా ప్రధానమైంది. అక్కడి ఆర్థిక పరిస్థితులు పర్యాటక పరిశ్రమపైనే ఆధారపడి ఉన్నాయి. ఈ నాలుగు నెలల కాలంలోనే ఎక్కువగా అక్కడి ప్రజలకు ఉపాధి లభిస్తుంటుంది.

రాష్ట్రంలో ఉగ్రవాద కార్యకలాపాలు మళ్లీ పెచ్చుమీరితే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పహల్గాం ఉగ్రదాడి భారత్‌కు కొత్త సవాళ్లను ముందుకు తెచ్చింది. ప్రభుత్వం గట్టిగా స్పందించి అక్కడి ప్రజలకు భరోసాను కల్పించాల్సిన సమయమిది. కశ్మీర్‌లో ఉగ్రవాదానికి నూకలు చెల్లిపోయేలా సరైన చర్యలు తీసుకోవాల్సిన సందర్భమిది.