22-11-2025 01:52:36 AM
ఆదిలాబాద్, నవంబర్ 21 (విజయక్రాం తి) : పురిటి నొప్పులు పడుతూ మగబిడ్డకు జన్మనిచ్చిన తల్లి సంతోషం ఎంతో సేపు నిలవలేదు. తల్లితో పాటు పుట్టిన బిడ్డ మృతి చెందడంతో కుటుంబంలో పెను విషాదాన్ని మిగిల్చింది. మృతుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... గుడిహత్నూర్ మండలం శాంతపూర్‌కి చెందిన గర్భిణి చిక్రం రుక్మాబాయికి రెండవ కాన్పు కోసం పురిటి నొప్పుల రావడంతో భర్త జ్ఞాన్ దేవ్ ఈనెల 20న మధ్యాహ్నం 108 అంబులెన్స్‌లో ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
కాగా కొద్దిసేపటికే పురిటి నొప్పులు అధికం అవ్వడంతో సాయంత్రం వైద్యులు ఆమెకు సిజేరి యన్ చేయగా, మగ బిడ్డని జన్మనిచ్చింది. అయితే పుట్టిన మగ బిడ్డ హార్ట్ బీట్ సరిగ్గా లేకపోవడంతో వైద్యులు గ్లాసులో ఉంచారు. ఇదిలా ఉంటే బెడ్ పై ఉన్న బాలింత చిక్రం రుక్మాబాయి అనుకోకుండా బెడ్ పై నుండి పడింది. ఐతే మెడిసిన్ కోసం బైటకు వెళ్ళిన భర్తకు ఈ విషయం సైతం ఆస్పత్రి సిబ్బంది చాలాసేపు చెప్పలేదని కుటుంబీకులు ఆరోపించారు. ఆరోగ్యం క్షీణించి అర్ధరాత్రి దాటాక పుట్టిన బిడ్డ మృతి చెందాడని, కొద్దిసేపటికే తల్లి సైతం మృతి చెందినట్లు తెలిపారు.
ఆసుపత్రిలో భర్త జ్ఞాన్‌దేవ్ ఒక్కరు మాత్ర మే ఉన్నారని, తమ గ్రామం నుంచి ఎవ్వరు రాకముందే ఆసుపత్రి సిబ్బంది హడావిడి చేసి భర్తతో సంతకం చేయించుకుని, శుక్రవారం ఉదయం 7 గంటలకే ఓ వాహనంలో తల్లి బిడ్డల మృతదేహాలను ఇంటికి తరలించారని కుటుంబీకులు ఆరోపించారు. అయితే తల్లీబిడ్డల మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.