calender_icon.png 7 May, 2025 | 4:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ సంఘాల పోరాటంతోనే కులగణన ప్రకటన

06-05-2025 12:00:00 AM

  1. బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచే వరకు ఉద్యమిస్తాం
  2. బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదించినందుకు గవర్నర్‌కు ధన్యవాదాలు
  3. జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్

ఖైరతాబాద్, మే 5 (విజయక్రాంతి): బీసీ సంఘాల పోరాటాల ఫలితంగానే కేంద్రప్రభుత్వం కులగణన ప్రకటన చేసిందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్య క్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ రాష్ట్రం లోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీసీ బిల్లును గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ ఎలాంటి సవరణలు లేకుండా యథా విధిగా ఆమోదించి రాష్ట్రపతికి పంపించిన సందర్భంగా బీసీ సంఘాల ప్రతినిధుల బృందం సోమవారం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో ఆయన్ను కలసి అభినంద నలు తెలిపారు.

అనంతరం జాజుల శ్రీనివాస్‌గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. ఏప్రిల్ 2న బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన బీసీల పోరుగర్జన మహాధర్నాలో 18 రాజకీయ పార్టీలు, 42 మంది ఎంపీలు, తెలం గాణ సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొనడంతో దేశస్థాయిలో కులగణనపై చర్చ జరిగిందన్నారు. తెలంగాణ, బిహార్‌లో జరి గిన కులగణనతో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగిందని తెలిపారు.

తెలంగాణలో ఇప్పటికే కులగణన పూర్తిచేసి 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ బిల్లు చేసినందున కేం ద్రప్రభుత్వం కులగణన పట్ల సానుకూల వైఖరి ఉందని తాము భావిస్తున్నట్టు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం పంపిన 42 శాతం బీసీ బిల్లును కేంద్రం తక్షణమే ఆమోదించి, తమిళనాడు తరహాలో 9వ షెడ్యూల్‌లో చేర్చి, చట్టరూపంలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.

జాతీయస్థాయిలో కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించాడాన్ని అభినందిస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర క్యాబినెట్ కూడా బీసీ ప్రతినిధుల బృందం ధన్యవాదాలు తెలిపింది. కార్యక్రమంలో బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేశ్‌చారి, కన్వీనర్ బాలగోని బాలరాజు గౌడ్, బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.