25-06-2024 12:05:00 AM
కొత్త పార్లమెంటు కొలువుదీరింది. ప్రధాని, మంత్రివర్గ సభ్యులు, పలు రాష్ట్రాల సభ్యులు తొలి రోజు ప్రమాణస్వీకారం చేశారు. మొత్తం సభ్యుల ప్రమాణంతో నరేంద్ర మోడీ నేతృత్వంలో ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం పని ప్రారంభమవుతుంది. ఇదంతా మామూలుగా జరిగే తతం గం. అయితే కొత్త పార్లమెంటు ఎలా ఉండబోతోందో సభ్యుల ప్రమాణ స్వీకారానికి ముందు ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలతోనే అర్థమవుతోంది. పార్లమెంటులో అడుగుపెట్టడానికి ముందు మీడియాతో మాట్లాడిన మోడీ తన మామూలు ధోరణిలోనే ప్రతిపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్‌పై తీవ్రదాడి చేశారు. 50 ఏళ్ల క్రితం అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీని గుర్తు చేస్తూ, కాంగ్రెస్ పార్టీని దుయ్యబట్టారు. భారతదేశ కొత్తతరం అప్పటి చీకటి రోజులను ఎప్పటికీ మరిచి పోరని అన్నారు.
రాజ్యాంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, దానిలో ప్రతి భాగాన్ని ముక్కలు ముక్కలుగా చించేశారని, దేశాన్ని ఓ జైలులా మార్చేశారని, ప్రజాస్వామ్యాన్ని కాలరాచారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజాస్వామ్యాన్ని, ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూనే ఎవరు కూడా అలాంటి తప్పు చేయడానికి సాహసించరాదని దేశ ప్రజలు తీర్పు ఇచ్చారని అన్నారు. అంతేకాదు, కొత్త సభలో ప్రతిపక్షం పోషించాల్సిన పాత్ర పైనా ఆయన హితబోధ చేశారు. ఈ దేశానికి మంచి బాధ్యతాయుతమైన ప్రతిపక్షం కావాలన్నారు. ప్రజాస్వామ్య మర్యాదను కాపాడేలా, సామాన్య ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రతిపక్షాలు నడుచుకుంటాయని ఆశిస్తున్నానన్నారు. చివరగా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రతిపక్షాలు కూడా సహకరించాలని కోరారు.
ప్రధాని మాటల్లో గతంలో ప్రతిపక్షాలపై ఆయన చేసిన విమర్శల వాడి కనిపించలేదు. ప్రతిపక్షాలు సహకరించకపోతే పార్లమెంటు సాగడం కష్టసాధ్యమన్న వాస్తవాన్ని ఆయన గ్రహించి నట్లు కూడా కనిపిస్తోంది. గత పార్లమెంటులో మొత్తం ప్రతిపక్ష సభ్యులను సభనుంచి గెంటివేసి తమకు కావలసిన బిల్లులను ఎలాంటి చర్చా లేకుండానే ఆమోదింప జేసుకున్న మోడీ సర్కార్ ఈసారి అలా చేసే స్థితిలో లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎన్డీఏ మిత్రపక్షాల సభ్యుల బలం పెరిగింది. మరోవైపు బీజేపీ గణనీయంగా సీట్లు కోల్పోయింది.
దీంతో సహజంగానే ప్రభుత్వంపై మిత్రపక్షాల ఒత్తిడి ఉంటుంది. దీనికి తోడు గత లోక్‌సభలో ప్రతిపక్ష హోదా కూడా దక్కని కాంగ్రెస్‌తో పాటు ఇండియా కూటమిలోని ఇతర భాగస్వామ్య పక్షాల బలం కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏ మార్పు తీసుకు రావాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర సహా పలు కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆయా రాష్ట్రాల్లో బీజేపీ మిత్రపక్షాలు బలంగా ఉఓన్నాయి. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకునే ప్రధాని ఇప్పుడే రాబోయే పోరుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది.
అయితే ప్రధాని వ్యాఖ్యలపై కాంగ్రెస్ కూడా అంతే ధాటిగా ఎదురుదాడి చేసింది. ఎప్పుడో 50 ఏళ్ల క్రితం నాటి ఎమర్జెన్సీని గుర్తు చేస్తూ ప్రధాని ఎంతకాలం పరిపాలన సాగిస్తారంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. నాటి ఎమర్జెన్సీ మాట సరే మీ పదేళ్ల కాలంలో కొనసాగిన అప్రకటిత ఎమర్జెన్సీ మాటేమిటని కూడా ఆయన ప్రశ్నించా రు. మరో వైపు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మరో అడుగు ముందుకు వేసి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి 15 రోజుల్లోనే పరీక్షల్లో అవకతవకలు, కశ్మీర్‌లో ఉగ్రదాడులు వంటివి చోటు చేసు కున్నాయని, అయినా ప్రధాని మాత్రం తన ప్రభుత్వాన్ని కాపాడుకునే పనిలో బిజీగా ఉన్నారన్నారు. రాజ్యాంగంపై మోడీ సర్కార్ దాడి చేస్తోందంటూ, రాజ్యాంగాన్ని ఏ శక్తీ తాకలేదని, దాన్ని తాము కాపాడి తీరు తామన్నారు. బలమైన ప్రతిపక్షం కేంద్రప్రభుత్వంపై దాడిని కొనసాగించి తీరుతుందంటూ భవిష్యత్తులో తమ పార్టీ ఎలా వ్యవహరించనుందో కూడా సంకేతాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో రాబోయే బడ్జెట్ సమావేశాలు వాడీ వేడిగా కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది.