28-08-2025 05:57:42 PM
అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి..
కలెక్టర్ కుమార్ దీపక్..
మంచిర్యాల (విజయక్రాంతి): వరద పరిస్థితుల దృష్ట్యా అధికార యంత్రాంగం ప్రజా సంరక్షణలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(District Collector Kumar Deepak) అన్నారు. గురువారం మంచిర్యాల పట్టణంలో గల గోదావరి నది తీరం, మాతా శిశు ఆసుపత్రి పరిసరాలను ఆర్.ఐ. శిరీషతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు నేపథ్యంలో వరద పరిస్థితులు ఏర్పడనున్న దృష్ట్యా ప్రజల రక్షణ కొరకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. గోదావరి నదిలో నీటి ప్రవాహం పెరుగుతున్నందున ప్రజలు అటువైపుగా వెళ్లకుండా బందోబస్తు చర్యలు చేపట్టాలని, రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి లోతట్టు, వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాసం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించిన కలెక్టర్
మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గుడిపేట వద్ద గల శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును మండల తహసిల్దార్ శ్రీనివాస్ రావు దేశ్ పాండే తో కలిసి సందర్శించారు. ప్రాజెక్టులోకి చేరుతున్న వరద నీటి వివరాలను ఎల్లంపల్లి డిఈ, ఎఈలను అడిగి తెలుసుకున్నారు. వరద నీటి ఇన్ ఫ్లో అధికంగా ఉన్నందున అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని, అత్యవసర చర్యలకు గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచుకోవాలని అధికారులకు సూచించారు. పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని, వర్షపు నీటి నిల్వలు లేకుండా ఎప్పటికప్పుడు తొలగిస్తూ దోమల వృద్ధిని అరికట్టేందుకు ఆయిల్ బాల్స్, దోమల మందు పిచికారి చేయాలన్నారు. ముల్కల్ల లోని గోదావరి నది తీరాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.