04-01-2026 12:23:10 AM
ముషీరాబాద్, జనవరి 3 (విజయక్రాంతి): ఆటో డ్రైవర్ల చలో అసెంబ్లీ ఉద్రిక్తం గా మారింది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఆటో రిక్షా డ్రైవర్స్ యూనియన్స్ జేఏసీ శనివారం చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టింది. ఏఐటీయూసీ సీనియర్ నాయకులు విఎస్. బోస్ తోపాటు వందలాది మంది ఆటో డ్రైవర్లు జేఏసీ ఆధ్వర్యంలో బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్ వద్ద నుంచి పెద్దఎత్తున నినాదాలు చేస్తూ అసెంబ్లీ వైపు దూసుకెళ్తుండగా, పోలీసులు వారిని మధ్యలోనే అడ్డుకున్నారు.
ఈ క్రమంలో పోలీసులు, ఆటోడ్రైవర్ల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. దీం తో ఆటో డ్రైవర్ల రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు వారిని బలవంతంగా అరెస్ట్ చేసి వివిధ పోలీస్‌స్టేషన్లకు తరలించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ బి. వెంకటేశం, జేఏసీ నాయకులు వేముల మారయ్య, ఎంఏ. సలీం, ప్రవీణ్, ఎ. సత్తిరెడ్డి, పి.యాదగిరి, శివానం దం, ఎండి. బాబా, ఎస్.అశోక్, సీహెచ్. జంగయ్య, ఎం.కృష్ణ, ఎం.నరసింహ, శ్రీనివాస్, శ్యామ్ లాల్, మల్లి కార్జున్, లింగం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.