08-11-2025 12:00:00 AM
ఈస్తటిక్స్ అధ్యక్షుడు రవిమారుత్
ఖమ్మం, నవంబర్7 (విజయక్రాంతి): ఖమ్మం నగరంలో ఈస్తటిక్స్ ఆధ్వర్యంలో శని, ఆదివారాల్లో రెండు రోజుల పాటు సాహితీ సంరంభం ఘనంగా నిర్వహించనున్నట్లు ఈస్తటిక్స్ అధ్యక్షుడు రవి మారుత్ తెలిపారు. సాహిత్య ప్రియులు, కవులు, విమర్శకులు, కథకలు పాల్గొనే ఈ కార్యక్రమం సృజనాత్మకత చర్చలతో నిండిపోనుందన్నారు. మొత్తం 30 ప్రముఖ కథకులు కథాంతరంగం పేరుతో జరిగే సదస్సులో పాల్గొననున్నట్లు ఆయన తెలిపారు.
ఆరు సమకాలనీ కథలను విశ్లేషించేందుకు ఆరుగురు ప్రతిభావంతులైన విశ్లేషకులు ఈ సదస్సులో పాల్గొననున్నారు. ఆధునిక తెలుగు కథలో సున్నితమైన శైలీ మార్పులు, సాహిత్య ధోరణులపై విభిన్న ఆలోచనల పరంపర సాగనుంది. ఈ నెల ౯న ఆదివారం సాయత్రం ఖమ్మం జెడ్పీ హాల్‌లో ఖమ్మం ఈస్తటిక్స్ వార్షిక పురస్కారాల కార్యక్రమం జరగనున్నట్లు ఖమ్మం ఈస్తటిక్స్ అధ్యక్షుడు రవిమారుత్ తెలిపారు.
అలాగే సాహితీ అవార్డుల ఫలితాలను కూడా ఆయన ప్రకటించారు. 90కి పైగా కవితా సంపుటులు,140కి పైగా కథలు రాగా కమిటీ అభ్యర్థన మేరకు కవిత్వానికి ముగ్గురు, కథలకు ముగ్గురు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. కవిత్వం విభాగంలో పలమనేరు బాలాజీ కవితా సంపుటి ‘లోపలేదో కదులుతున్నట్లుంది’ ౪౦వేల రూపాయల బహుమతిని గెలుచుకుంది. అలాగే రేణుక అయోలా కవితా సంపుటి ‘రవిక’, పాయల మురళీకృష్ణ గచ్చం చెట్టుకు అటూఇటూ ప్రోత్సాహక బహుమతులు దక్కాయి. కథల విభాగంలో ఉత్తమ కథగా వి.ఆర్ రాసాని‘తేనెకల్లు’ 25 వేల రూపాయల బహుమిని గెల్చుకుంది.
ద్వితీయ కథగా ఆలూరి అరుణ్‌కుమార్ 15 వేల రూపాయల బహుమతిని, తృతీయ ఉత్తమ కథగా యాములపల్లి నర్సిరెడ్డి‘అంజమ్మ’ ౧౦వేల రూపాయల బహుమతి గెల్చుకున్నాయి. కాగా ఎం.సుగుణాకరరావు‘అప్పో దీపోభవ’, సుంకోజు దేవేంద్రాచారి ‘శివుడాజ్ఞ’, ఎం.ప్రగతి ‘ఉంకువ’ సంజయ్‌ఖాన్‘మూడో కన్ను’, పీవీవీ సత్యనారాయణ ‘భాగ్యమతి’, జీవీ శ్రీనివాస్ ‘నేలరాలిన పువ్వు,
బి.కళాగోపాల్ ‘ఇష అనంతం’,గుమ్మడి రవీంద్రనాథ్ ‘అనగనగా ఒక హంస’, ఆర్వీ రమణశాస్త్రి ‘అసూయ’ కథలు సాధారణ ప్రచురణకు ఎంపికయ్యాయి. న్యాయ నిర్ణేతలుగా రవిమారుత్, ప్రసేన్,సీతారాం, వంశీకృష్ణ, మువ్వా శ్రీనివాసరావ్, పగిడిపల్లి వెంకటేశ్వర్లు, ఫణిమాధవి కన్నోజు, గౌరవాధ్యక్షులు ఓల్గా, లంకా ప్రసాద్ వ్యవహరించారు.