calender_icon.png 18 May, 2025 | 11:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుపేదల పక్షపాతి అనభేరి

13-03-2025 12:00:00 AM

రజాకార్ పోలీసులు ప్రజలను పట్టి పీడిస్తూ, పన్నులు వసూలు చేస్తూ, మహిళలను వివస్త్రలను చేసి అత్యాచారాలకు ఒడిగడుతుంటే అనభేరి చూస్తూ ఊరుకోలేదు. వారి గుండెల్లో వణుకు పుట్టేలా రణభేరి మ్రోగించారు. మృత్యు ముఖానికి ఎదురు వెళ్లి నిజాం ఆధిపత్యాన్ని ప్రశ్నించిన ధీశాలి ప్రభాకర్‌రావు. 

తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, నిజాం గుండెల్లో రణభేరి మోగించిన అనభేరి ప్రభాకర్ రావు, సింగిరెడ్డి భూపతిరెడ్డితో పాటు మరో 10 మంది రజాకార్ల దాడిలో ప్రాణాలు కోల్పో యి రేపటికి (మార్చి 14కు) 77 ఏళ్లు పూర్తవుతాయి. హైదరాబాద్ సంస్థానంలోని నిజం నవాబు  ఆగడాలు రోజురోజుకు పేట్రేగిపోతున్న రోజుల్లో భూస్వామ్య వ్యవస్థపై, రజాకార్ల ఆగడాలపై, గ్రామాల్లో పటేల్, పట్వారాల ధిత్యాన్ని ఎదిరించిన ధీరుడు అనభేరి.

తెలంగాణ సాయుధ పోరాటానికి రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మగ్దూం మొహియుద్దీన్‌లు పిలునివ్వడంతో  గ్రామాలో వందలాది యువ కులు ఉద్యమించడానికి ముందుకు రావడంతో అనగాని ప్రభాకర్ రావు వారందరికీ నాయకత్వం వహించారు. అలాంటి వ్యక్తి 1948 మార్చి 14న రజాకార్ల తుపాకీ గుళ్లకు దారుణంగా బలయ్యారు.

కరీంనగర్‌లోని కూరగాయల మార్కెట్ వద్ద ఆయన స్మారక విగ్రహం, సిద్దిపేట జిల్లా హుస్నాబా ద్ మండలం మహ్మదాబాద్ గ్రామ శివార్ల లో ఆయనతో పాటు అసువులు బాసిన 12 మంది స్మారక స్థూపాల వద ్దఆయన అభిమానులు ఏటా నివాళులు అర్పిస్తూనే ఉ న్నారు. ఇన్నేళ్లుగా ఆయన సేవలను స్మరించుకోవడమే ఆయనకు నిజమైన నివాళి. 

అనభేరి ప్రభాకర్‌రావు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోలంపల్లి గ్రామం లో అనభేరి వెంకటేశ్వర రావు- రాధాబా యి దంపతులకు 1910 ఆగస్టు15న రెండ వ సంతానంగా జన్మించారు. 400 వంద ల ఎకరాలకుపైగా భూములున్న భూస్వా మ్య కుటుంబంలో జన్మించిన ప్రభాకర్‌రావు ప్రాథమిక విద్యను కరీంనగర్‌లో అభ్యసించారు. అనంతరం మచిలీపట్నం లో కొన్నాళ్లపాటు చదువుకొన్నారు. హైదరాబాద్‌లోని రెడ్డి హాస్టల్‌లో ఉంటూ, చాదర్‌ఘాట్ హైస్కూల్లో పదవ తరగతి పూర్తి చేశారు. అనంతరం నిజాం కళాశాలలో ఇంటర్ చదివారు.

గొప్ప నాయకుల స్ఫూర్తితోనే!

ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా చిన్న వయస్సులోనే సరళాదేవితో ప్రభాకర్‌రావు వివాహం జరిగింది. ఆ దంపతుల కు ముగ్గురు కుమార్తెలు (సులోచనా దేవి, శకుంతలా దేవి, విప్లవ కుమారి జన్మించా రు. తన స్వగ్రామంలో పటేల్, పట్వారీ, భూ స్వామ్య విధానాలకు స్వస్తి పలకాలని, వెట్టి చాకిరి, బానిసత్వం ఉండకూడదని భావించి పాలేరుల పిల్లలను బడిలో చేర్పించారు. గ్రామంలో రైతు మహాసభలు నిర్వహించి వారిని చైతన్య పరిచారు.

గ్రామంలో సహకార సంఘాలను ఏర్పాటు చేశారు. కరీం నగర్‌లో చేనేత సహకార సంఘం ఏర్పాటు చేసి ఆ రోజుల్లోనే 30 వేలమందికి రేషన్ కార్డులు ఇప్పించారు. 1942 నుంచి 1946 వరకు ఆ సంఘానికి రాష్ట్ర అధ్యక్షులుగా పని చేశారు.

విద్యార్థి దశలోనే నిజాం పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించారు. ఆంధ్ర మహాసభ పేరుతో బద్దం ఎల్లారెడ్డి, రావి నారాయణరెడ్డి, మగ్దూం మొహియుద్దీన్ వంటి గొప్ప నాయకులు నిర్వహించే సభ లు, సమావేశాలకు ఆకర్షితులైనారు. వారి ఆదేశాలకు అనుగుణంగా ఆంధ్ర మహాసభ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్నారు. 

ఆధిపత్యానికి ఎదురొడ్డి..

1936లో  సిరిసిల్లలో జరిగిన ఆంధ్ర మహాసభ నాల్గవ ప్లీనరీలో ప్రభాకర్‌రావు కీలక భూమిక పోషించారు. భారత కమ్యూనిస్టు పార్టీ కరీంనగర్ జిల్లా మొట్టమొదటి కార్యదర్శిగా పనిచేశారు. విజయవాడ, చందా, సిరివం చ, అదిలాబాద్, కరీంనగర్ దళాలకు శిక్షణ ఇచ్చారు. మొట్టమొదటి దళం అనభేరి ప్రభాకర్ రావుదే. ఆయన ఒక్కరి వద్దనే స్టెన్ గన్ ఉండేది.

హైదరాబాద్ సంస్థానంలోని నిజాం నవాబు వారి తాబేదారులైన దేశ్‌ముఖ్‌లు, దొరలు, పటేల్, పట్వారీలు, రజాకార్ పోలీసులు ప్రజలను పట్టి పీడి స్తూ, పన్నులు వసూలు చేస్తూ, మహిళలను వివస్త్రలను చేసి అత్యాచారాలకు ఒడిగడుతుంటే చూస్తూ ఊరుకోలేదు. మృత్యు ముఖానికి ఎదురు వెళ్లి నిజాం ఆధిపత్యాన్ని ప్రశ్నించారు.

భూమికోసం, భుక్తికోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం ఉవ్వెత్తున సాగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో భాగంగా అణగారిన వర్గాలకు, మహిళలకు అండగా నిలిచారు. నిజాం నవాబు, రజాకార్ల తుపాకీ గుండ్లకు ఎదురొడ్డి వీరోచితం గా పోరాడిన గొప్ప విప్లవకారుడుగా అనభేరి తనదైన చరిత్రను లిఖించారు.

నిజాం సర్కారుకు నిద్రలేదు!

భూస్వామ్య వ్యవస్థపై తిరుగుబాటు చేస్తున్న అనభేరి ప్రభాకర్‌రావుకు తాలూకాదార్ పదవి ఇస్తానని నిజాం సర్కార్ కబు రు పెట్టారు. అయినా, లెక్క చేయలేదు. నిజాం సర్కార్ అనభేరిపై నజర్ బంద్ ప్రకటించాడు. అయినప్పటికీ సర్కార్‌కు నిద్ర లేకుండా చేసిన ధైర్యశీలీ అనభేరి. తమకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న అనభేరి ప్రభాకర్‌రావుని పట్టిస్తే 50 వేల నజ రానా ఇస్తామని నిజాం ప్రభుత్వం ప్రకటించింది.

దీన్నిబట్టి అనభేరి వారికి ఎంతటి టార్గెట్ అయ్యాడో అర్థమవుతున్నది. అణభేరిని లొంగదీసుకోవడం కోసం నిజాం సర్కార్ చేయని ప్రయత్నం లేదు. “నేనేప్పు డూ పేదల పక్షమే” అని చాటి చెప్పిన విప్ల వ యోధుడు అనభేరి ప్రభాకర్ రావు. 1948 మార్చి 14న అనభేరి ప్రభాకర్‌రావు, సింగిరెడ్డి భూపతిరెడ్డిల దళం సభ్యులంతా హుస్నాబాద్‌కు 5 కి.మీ. దూరంలోని మహ్మదాపూర్ గ్రామంలో భోజనం చేస్తుండగా, రజాకార్ పోలీసులు చుట్టుముట్టారు. వారంతా నలుదిక్కులు వెళ్లడంతో రజాకార్లు కాల్పులు జరిపారు. 

దళ సభ్యులు ఒక్కొక్కరుగా నేలకొరుగుతుంటే తట్టుకోలేని ప్రభాకర్‌రావు రజాకా ర్లపై కాల్పులు జరుపుతూ గుట్ట ఎక్కసాగా రు. చివరకు ఆయన చేతిపై రజాకార్ల కాల్పు లు జరిపి ఆయనను నిరాయుధుణ్ణి చేసి కాల్చి చంపారు.

ఈ వీరోచిత పోరాటంలో ప్రభాకర్‌రావుతో పాటు దళంలోని తాడూ రు గ్రామానికి చెందిన సింగిరెడ్డి భూపతిరెడ్డి, ఓగులాపూర్ గ్రామానికి  చెందిన ముస్కు చొక్కారెడ్డి, ఏలేటి మల్లారెడ్డి, సోమారంపేట గ్రామానికి చెందిన అయిరెడ్డి భూంరెడ్డి, పోరెడ్డి రాంరెడ్డి, బేగంపేట గ్రామానికి చెందిన తూమోజు నారాయణ, నల్గొండ జిల్లాకు చెందిన బి.దామోదర్ రెడ్డి, గాలిపెల్లి గ్రామానికి చెందిన ఇల్లందు ల పాపయ్య, రేగడి మద్దికుంట గ్రామానికి చెందిన నల్లగొండ రాజారాం, సిక్కుడు సాయిలు, రేపాక గ్రామానికి చెందిన రొండ్ల మాధవ రెడ్డిలు మొత్తం 12 మంది వీరులు వీరోచితంగా పోరాడి అసువులు బాసారు.

వీరులు మరణించరు!

దేశ స్వాతంత్య్రం కోసం, హైదరాబాద్ సంస్థానంలోని నిజాం సర్కారుకు వ్యతిరేకంగా తాడిత, పీడిత ప్రజలకు అండగా నిలిచి వీరోచితంగా పోరాడి, తన ప్రాణాలను తృణప్రాయంగా వదిలేసిన అనభేరి ప్రభాకర్‌రావు వంటి మహనీయుని విగ్రహాన్ని కరీంనగర్ నడిబొడ్డున ప్రధాన కూర గాయల మార్కెట్ చౌరస్తావద్ద 1994 జనవరి 12న నాటి ముఖ్యమంత్రి కోట్ల విజయ భాస్కర్‌రెడ్డి చేతుల మీదుగా స్థాపించారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రసాధన ఉద్యమం లో రాజకీయ పార్టీలు అమరుల త్యాగాలను కొనియాడి నేడు విస్మరించడం కొంత బాధ కలిగించినప్పటికీ సీపీఐ గత 76 సంవత్సరాలుగా  మహ్మదాపూర్ అమరవీరులను స్మరిస్తూ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నది.

ఈ నేపథ్యంలో మార్చి 14న కరీంనగర్, మహ్మదాపూర్‌లో అమరవీరుల 77వ వర్ధంతి కార్యక్రమం జరగనుం ది. అమరుల త్యాగాలకు ప్రభుత్వాలు ఇకనైనా గుర్తింపునివ్వాలి. నాటి వారి ప్రాణ త్యాగ ఫలితమే నేడు స్వేచ్ఛగా జీవిస్తున్నామన్న దానిని అందరం గుర్తించాలి.

 వ్యాసకర్త మాజీ ఎమ్మెల్యే, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు