calender_icon.png 22 December, 2025 | 11:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రంథం సరస్వతి స్వరూపం

19-12-2025 12:00:00 AM

నేటి నుంచి భాగ్యనగర పుస్తక మేళా :

భారతీయ గ్రంథాలు కీర్తి సంకేతాలు.. గ్రంథం సరస్వతి స్వరూపం. భాగ్యనగర పుస్తక మేళా సందర్భాన్ని పురస్కరించుకొని ఈ భావన మరింత లోతుగా మనసును తాకుతుంది. ‘అక్షర రూపం దాల్చిన ఒకే ఒక సిరాచుక్క లక్షల మెదళ్లకు కదలిక’ అనేది అక్షర శక్తిని సారాంశంగా చెప్పిన మహావాక్యం. మనిషి తన ఆలోచనలను గ్రంథ రూపంలో నిలిపితే, అవి తరతరాలకు సంభాషణలుగా మారాయి. మనిషి ఆయుష్షు పరిమితం, గ్రంథ ఆయుష్షు అనంతం.

గ్రంథానికి వయస్సు లేదు, మరణం లేదు. భారతీయ సాహిత్య వైభవం విదేశీయులను ఎప్పుడూ ఆకర్షించింది. అలెగ్జాండర్ భారతదేశ యాత్ర సందర్భంలో అతని గురువు ఆరిస్టాటిల్ ఇక్కడి తత్వ సాహిత్యాన్ని తెమ్మన్న వృత్తాంతం ప్రసిద్ధం. బుద్ధబోధన గ్రంథాలు చైనా, టిబెట్, అఫ్గానిస్తాన్, మంగోలియా దేశాలకు వ్యాపించి భారతదేశాన్ని జ్ఞానయాత్రల కేంద్రంగా మార్చాయి. భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పిన ప్రధాన మాధ్యమం గ్రంథమే.

నలంద, తక్షశిల వంటి ప్రాచీన విశ్వవిద్యాలయాల్లో అపురూప తాళపత్ర గ్రంథాలు భద్రపరిచారు. అయితే దాడులు, విధ్వంసాల వల్ల ఎన్నో అమూల్య గ్రంథాలు నశించాయి. మానవ ఈర్ష్య, అసూయ, కుటిల బుద్ధి కారణంగా మానవ మేధ మరుగున పడిపోయింది. ముద్రణ యంత్రాల ఆవిర్భావంతో గ్రంథ ప్రచురణ సులభమైంది. ఒక గ్రంథం వందలాది ప్రతులుగా పాఠకుల చెంతకు చేరింది. అంతకు ముందు రాజస్ధానాల్లో ప్రతుల తయారీ ప్రత్యేక వృ త్తిగా సాగేది.

దీనికి శ్రమ, కాలం అధికంగా అవసరమయ్యేవి. డిజిటలైజేషన్ యుగంలో ఈ- లైబ్రరీలు విస్తరించినప్పటికీ ముద్రిత గ్రంథపు స్పర్శ, సువాసన, అనుభూతి మాత్రం ఇసు మంతైనా తగ్గలేదు. హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఈ సంప్రదాయానికి ఆధునిక ప్రతిరూపం. తొలి పుస్తక ప్రదర్శన 1985లో అశోక్‌నగర్ సిటీ సెంట్రల్ లైబ్రరీలో జరిగింది. ఆపై నిజాం కాలేజీ గ్రౌండ్స్, పబ్లిక్ గార్డెన్స్, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, కేశవ్ మెమోరియల్ హైస్కూల్ గ్రౌండ్స్‌లో కొనసాగింది.

తెలంగాణ రాష్ర్ట ఏర్పాటుతో ఎన్టీఆర్ గ్రౌండ్స్‌లో నిరంతరంగా నిర్వ హించబడుతోంది. నేటి నుంచి 29 వరకు ఇందిరాపార్క్ సమీపంలోని ఎన్టీఆర్ స్టేడియంలో 38వ జాతీయ పుస్తక ప్రదర్శన అట్టహాసంగా జరుగనుంది. నేడు సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బుక్ ఫెయిర్ ప్రారంభం కానుంది. 300కు పైగా స్టాళ్లు, విభిన్న భాషల పుస్తకాలు, రచయితల కోసం ప్రత్యేక స్టాళ్లు, పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు అవసరమైన గ్రంథాలు, రోజూ సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన కొనసాగనుంది.

బహుభాషలు, రచయితలు, ముద్రాపకులు, పాఠకులు ఒకేచోట చేరితే అది విజ్ఞాన విశ్వమే. దేవుణ్ని జాతరలో కొలిచినట్లే, గ్రంథాలను పవిత్రంగా భావించే సంస్కృతి భారతీయులది. కొనేవారు, చదివేవారు, తిలకించేవారు, కుటుంబాలు, విద్యార్థులు, రచయితలు, కవులు, సాహితీప్రియులు ఇలా అందరూ కలిసి పండుగ చేసుకునే భాగ్యనగర పుస్తక మేళా మరచిపోలేని అనుభూతిని మిగులుస్తుంది. జ్ఞానానికి జాతరగా నిలిచే ఈ గ్రంథాల పండుగ భారతీయ సాంస్కృతిక కీర్తి సంకేతంగా తరతరాలకు దారి చూపుతూనే ఉంటుంది.

 రామ కిష్టయ్య సంగన భట్ల, 9440595494