calender_icon.png 22 December, 2025 | 9:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘నేషనల్ హెరాల్డ్’ రగడ!

19-12-2025 12:00:00 AM

దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసిన అంశాల్లో నేషనల్ హెరాల్డ్ కేసు ఒకటి. కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను లక్ష్యంగా చేసుకుని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ద్వారా బీజేపీ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆ పార్టీ ఆరోపణలు చేసింది. తాజాగా ఢిల్లీలోని రోజ్ అవెన్యూ కోర్టు కేసు విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక ప్రైవేటు వ్యక్తి చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈడీ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌ను పరిగణలోకి తీసుకోలేమని కోర్టు తెలిపింది.

అంతేకాదు పీఎంఎల్‌ఏ చట్టం ప్రకారం మనీలాండరింగ్ కేసు కొనసాగడానికి షెడ్యూల్డ్ ఆఫెన్స్ (అంతర్లీన నేరం) ఆధారంగా ఎఫ్‌ఐఆర్ ఉండాలని కోర్టు స్పష్టం చేసింది. ఇది కాంగ్రెస్‌కు ఊరట కలిగించే అంశమైనప్పటికీ, కోర్టు నిర్ణయాన్ని ఈడీ సవాల్ చేసే అవకాశముంది. గత నవంబర్‌లో ఈడీ సమాచారం ఆధారంగా ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. మరోవైపు రాహుల్‌పై కక్ష సాధింపు చర్యలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ శ్రేణులు దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునివ్వడం ప్రాముఖ్యతను సంతరించుకుంది.

నేషనల్ హెరాల్డ్ కేసు నేపథ్యం ఒకసారి పరిశీలిద్దాం. 1938లో నేషనల్ హెరాల్డ్ వార్తా పత్రికను జవహర్‌లాల్ నెహ్రూ ప్రారంభించారు. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్) అనే సంస్థ ఈ పత్రికను ప్రచురించేది. 1942లో బ్రిటీష్ ప్రభుత్వం నేషనల్ హెరాల్డ్ పత్రికను నిషేధించింది. 1945లో తిరిగి ప్రారంభమైన నేషనల్ హెరాల్డ్ పత్రికను ఆర్థిక కారణాలతో 2008లో  మూసేయాల్సి వచ్చింది. నేషనల్ హెరాల్డ్‌ను మూసే సమయానికి ఏజేఎల్ సంస్థకు కాంగ్రెస్ పార్టీ రూ. 90 కోట్ల మేర బకాయి పడినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలోనే 2012లో బీజేపీ నేత సుబ్రమణియన్ స్వామి ఢిల్లీలోని స్థానిక ట్రయల్ కోర్టులో గాంధీ కుటుంబం మీద కేసు వేశారు. ఏజేఎల్ సంస్థకు చెందిన 2 వేల కోట్ల రూపాయలకు పైగా ఆస్తులను హస్తగతం చేసుకోవడం కోసం, ఆ సంస్థను తమ యాజమాన్యంలోకి తెచ్చుకోవటానికి కాంగ్రెస్ పార్టీ నిధులను ఉపయోగించుకుందని ఆయన ఆరోపించారు. సుబ్రమణియన్ ఫిర్యాదు ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.

నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రచురించే ఏజేఎల్‌కు కాంగ్రెస్ పార్టీ రూ.90 కోట్లకు పైగా వడ్డీలేని రుణం ఇచ్చిందని ఈడీ పేర్కొంది. ఆ రుణాన్ని రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకు... మెజార్టీ వాటాలు ఉన్న యంగ్ ఇండియన్ లిమిటెడ్ (వైఐఎల్) సంస్థ ద్వారా రూ.50 లక్షలు మాత్రమే చెల్లించి.. ఏజేఎల్‌కు చెందిన సుమారు రూ. 2 వేల కోట్లు సొంతం చేసుకున్నారని ఈడీ ఆరోపించింది. ఇది మనీలాండరింగ్ చర్య కిందకు వస్తుందంటూ ఈడీ 2025 ఏప్రిల్‌లో చార్జ్‌షీట్ దాఖలు చేసింది. కాగా ఈ కేసు దశాబ్దకాలంగా రాజకీయ వివాదంగా మారింది.

నేషనల్ హెరాల్డ్ పత్రిక స్వాతంత్య్రోద్యమంతో ముడిపడి ఉండటం, దాని ఆస్తులు ఢిల్లీ, ముంబై, లక్నోల్లో ఉండటంతో వివాదం మరింత ముదిరింది. కాంగ్రెస్ నాయకులు ఇది పత్రికను పునరుజ్జీవింపజేయడానికి చేసిన ప్రయత్నమని వాదిస్తుంటే, ఇది ఆస్తుల దుర్వినియోగమని ఈడీ ఆరోపిస్తోంది. తాజా కోర్టు నిర్ణయంతో సోనియా, రాహుల్‌లకు ఊరట లభించినప్పటికీ, కేసు పూర్తిగా ముగిసినట్టు కాదు. భవిష్యత్తులో మరిన్ని పరిణామాలు జరగవచ్చు.