06-10-2025 12:00:00 AM
-కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి విశేష కృషి చేసిన దామోదర్ రెడ్డి
-కమ్యూనిస్టుల కంచుకోటలో హ్యాట్రిక్ విజయం.
-తెలంగాణ ఉద్యమంలోనూ క్రియాశీలక పాత్ర.
-అధికార లాంఛనాలతో అంత్యక్రియలు
-దామన్న యాధిలో..
తుంగతుర్తి, అక్టోబర్ 5 : ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో లక్షలాది మంది అభిమానులు ఉన్న నేత ఎవరైనా ఉన్నారంటే మొదటగా వినిపించే పేరు ఉమ్మడి నల్గొండ జిల్లా టైగర్ రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి పేరే మొదట వినిపిస్తుంది. అలాంటి ప్రజాభిమాన నేత పుట్టిన నాటి నుండి గిట్టే వరకు కాంగ్రెస్ పార్టీతో వేలాదిమంది కార్యకర్తలను ప్రజా ప్రతినిధులు, నేతలుగా తీర్చిదిద్ది అయిదు సార్లు ఎమ్మెల్యేగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు పర్యాయాలు మంత్రిగా, ప్రజలకు ఎన్నో సేవలు అందించిన మహోన్నతమైన నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డి (73) అనారోగ్యంతో ఏఐజి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి తుది శ్వాస విడిచిన విషయం విధితమే.. దామన్నను యాది చేస్తూ ఆయన ప్రస్థానంపై ప్రత్యేక కథనం..
కమ్యూనిస్టు కోటలో దామన్న హ్యాట్రిక్ విజయం
కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్న తుంగతుర్తి నియోజకవర్గం నుంచి 1985లో పోటీ చేసిన మొదటి సారి దిగ్గజ నాయకురాలు మల్లు స్వరాజ్యం ను ఓడించి రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. ఆ తరువాత వరుసగా 1989,1994 మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నిలిచారు. 1999లో టిడిపి అభ్యర్థి సంకినేని వెంకటేశ్వరరావు చేతిలో తొలిసారి ఓటమిపాలయ్యారు.
2004లో మరోసారి విజయం సాధించి వైయస్ రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్లో ఐటీ మంత్రిగా పనిచేశారు 2009లో తుంగతుర్తి నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ కావడంతో ఆయన తుంగతుర్తి నుండి సూర్యాపేటకి వచ్చి పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన దామోదర్ రెడ్డి రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014, 2018, 2023లో ఓటమి పాలయ్యారు అసెంబ్లీలో అడుగు పెట్టలేకపోయారు. అయినా తుంగతుర్తి సూర్యాపేట నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీని నేటికీ ఆయనే శాసిస్తున్నారు.
దామన్న లేరనే వార్తన
జీర్ణించుకోలేకపోతున్న కాంగ్రెస్ కార్యకర్తలు తమ అభిమాన నేత టైగర్ దామన్న లేరనే వార్తను గత నాలుగు రోజులుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు దామన్న మరణ వార్త తెలుసుకొని వారంతా శోకసంద్రంలో మునిగిపోయారు.
తొమ్మిది ఎకరాల్లో గడి :
తుంగతుర్తి లో 9 ఎకరాల్లో విశాలమైన ప్రాచీన గడి ఉంది దామోదర్ రెడ్డి ఇందులోనే ఉండేవారు గడి చుట్టూ ప్రహరీ నిర్మించి సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయించారు. గడి చుట్టూ పామాయిల్ తోటలు, పండ్ల తోటలు సాగు చేసేవారు ఈ మధ్య కాలంలోనే గడిని ఆధునికరించి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు దీంతో పాటు ఆయనకు మార్కెట్లో వచ్చిన కొత్త వాహనాలను కొనుగోలు చేసేవాడు ట్రాక్టర్లు, కార్లు, జిప్సీలు, వ్యాన్లపై ఎక్కువ మక్కువ ఉండేది ఏ ఒక్క వాహనాన్ని కూడా అమ్మకుండానే గడి ముందు ఉంచారు.
వ్యవసాయంపై అమిత ఇష్టంతో.. :
దామోదర్ రెడ్డికి వ్యవసాయం అంటే చాలా మక్కువ. ఈ ప్రాంతానికి నీటి సౌకర్యం తీసుకొచ్చి రైతులకు మేలు చేయాలనే సాకుతో ఎన్నో ఉద్యమాలు చేశారు 1996లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎస్సారెస్పీ కాలువలకు శంకుస్థాపన చేసి వదిలేశారు. 1999లో అప్పటి సీఎల్పీ నేత పి జనార్దన్ రెడ్డితో కలిసి దామోదర్ రెడ్డి శిలాఫలకం వద్ద రక్తతర్పణం చేశారు.
అలాగే వై.యస్ రాజశేఖర్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఇదే శిలాఫలకం వద్ద మొక్కలు నాటి నిరసన తెలిపారు. 2004లో వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే జలయజ్ఞంలో భాగంగా ఎస్సారెస్పీ కాలువలకు నిధులు కేటాయింపజేసి కాల్వ పనులు పూర్తి చేయించారు 2009లో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా గోదావరి జలాలను విడుదల చేయించారు ఈ కాలువ ద్వారా జిల్లాలకు వందలాది ఎకరాలకు సాగునీరు అందుతుంది.
మిత్రుడు వైయస్సార్ కోసం పదవి త్యాగం:
రాజకీయాల్లో ఎవరైనా మంత్రి పదవి కోసం పోరాటం చేస్తారు కానీ తన మిత్రుడిని సీఎం చేయాలని గట్టిగా మాట్లాడి క్యాబినెట్ మంత్రి పదవి ఆ తర్వాత ఎన్నికల్లో తనతో పాటు తన సొంత అన్న టికెట్ కూడా పోగొట్టుకున్నారు. కాంగ్రెస్ నేత మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి 1993లో నెదురుమల్లి జనార్దన్ రెడ్డిని సీఎంగా తప్పించే సమయంలో ఆయన క్యాబినెట్ లో ఉన్న దామోదర్ రెడ్డి, జలగం ప్రసాద్ రావు వైయస్సార్ ను సీఎం చేయాలని డిమాండ్ చేశారు.
కానీ నాటి ప్రధాని పివి కోట్ల విజయభాస్కర్ రెడ్డిని సీఎం చేశారు. దీంతో 1994 ఎన్నికల్లో దామోదర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకుండా అప్పటి సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి తన చిన్న కోడలు మేనమామ జన్నారెడ్డి సుధీర్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. దామోదర్ రెడ్డి సొంత చెల్లిని సుధీర్ రెడ్డి అన్న శ్యాంసుందర్ రెడ్డి వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో నాకు టికెట్ ఇవ్వరా..?? నా సత్తా ఏంటో చూస్తా! అని తుంగతుర్తి నుండి ఇండిపెండెంట్ గా పోటీ చేసి దామోదర్ రెడ్డి గెలుపొందారు మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లాలో టిడిపి ప్రభంజనం సృష్టించగా తుంగతుర్తిలో మాత్రం ఓటమి చవిచూసింది.
1994 ఎన్నికల్లో మొత్తం 294 స్థానాల్లో కాంగ్రెస్ కేవలం 26 సీట్లు మాత్రమే దక్కాయి ఉమ్మడి ఖమ్మం, నల్గొండలోని మొత్తం 21 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదు. నాటి సీఎం ఎన్టీఆర్ టిడిపిలో చేరమని ఆహ్వానించిన దామోదర్ రెడ్డి ఆ పార్టీలో చేరకుండా కాంగ్రెస్ అనుబంధ సభ్యుడిగా ఉంటూ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దక్కన్ క్రానికల్ చైర్మన్ వెంకట్రామిరెడ్డికి ఓటు వేశారు. ఆ తర్వాత పదేళ్ల తర్వాత ఎవరు సీఎం కావాలని పోరాడారో అదే నేత వైయస్సార్ క్యాబినెట్లో మంత్రిగా పని చేశారు.
వ్యవసాయ క్షేత్రంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు :
తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల ప్రజల సందర్శన కోసం 4వ రోజు తుంగతుర్తిలో అశేష ప్రజానీకం మధ్య తన వ్యవసాయ క్షేత్రంలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు ఏర్పాటు చేశారు. దీనితో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు దామన్న అమర హే..! జై కాంగ్రెస్, జై టైగర్ దామన్న, అనే నినాదాలతో తుంగతుర్తి మారుమోగింది. దామన్న శకం ముగిసిందని నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు ఆవేదన గురయ్యారు.
స్నేహం అంటే ఇదే కదా....
తన ఆత్మీయ మిత్రుడు దామన్న చితి పూర్తిగా కాలే అంత వరకు ఇక్కడే కూర్చుంటా అని కుర్చీ వేసుకొని మాజీ పిసిసి అధ్యక్షులు వి.హనుమంతరావు అక్కడే కూర్చుని తన స్నేహితునిపై ఉన్న ప్రేమను చాటుకున్నాను. అది చూసిన పలువురు నిజంగా స్నేహమంటే ఇదేరా.. అంటూ చర్చించుకున్నారు.