05-01-2026 02:15:21 AM
జాతీయ ఉపాధ్యాయ శిక్షణా సంస్థ నిర్లక్ష్యంతోనే ఆ తీర్పు
ఏఐఎస్టీఎఫ్ జాతీయ ప్రధానకార్యదర్శి సదానందంగౌడ్
హైదరాబాద్, జనవరి 4 (విజయక్రాంతి): దేశవ్యాప్తంగా టీచర్లకు టెట్ నుంచి మినహాయింపునిచ్చేలా కేంద్ర ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్(ఎస్‌ఎల్‌పీ)ను సుప్రీం కోర్టులో వేయాలని ఆల్ ఇండియా టీచర్స్ ఫెడరేషన్ (ఏఐఎస్టీఎఫ్) జాతీయ ప్రధానకార్యదర్శి, ఎస్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జీ సదానందంగౌడ్, ప్రధానకార్యదర్శి జుట్టు గజేందర్ పేర్కొన్నారు. ఆదివారం రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఏఐఎస్టీఎఫ్ జాతీయ కార్యవర్గ సమావేశం వర్కింగ్ ప్రెసిడెంట్ కత్తి నరసింహారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ రాష్ట్రాల నుంచి ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు హాజరయ్యా రు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యాహక్కు చట్టం అమలు తేదీకి ముందు నియామకమైన ఉపాధ్యాయులు రెండేళ్లలో టెట్ పాస్ కావాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటీషన్ వేయాలని డిమాండ్ చేశారు. జాతీయ ఉపాధ్యాయ శిక్షణా సంస్థ నిర్లక్ష్యం వల్లే ఇలాంటి తీర్పు వచ్చిందని వారు అభిప్రాయపడ్డారు. తీర్పు వచ్చి నాలుగు నెలలు గడుస్తున్నా, దేశవ్యాప్తంగా ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఆల్ ఇండియా జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ టీచర్స్ ఆర్గనైజేషన్స్ ఆధ్వర్యంలో ఉమ్మడి ఉద్యమం నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సమావేశంలో నాయకులు పరమేశ్, సాబేర్ అలి, పున్న గణేష్, శ్రీశైలం, శ్రీధర్ పాల్గొన్నారు.