09-07-2025 06:55:59 PM
తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్ 282 ను వెనక్కి తీసుకోవాలి..
జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బూడిద గణేష్..
మంథని (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బూడిద గణేష్ డిమాండ్ చేశారు. బుధవారం కార్మిక సంఘాలు దేశవాప్త సమ్మెకు ఇచ్చిన పిలుపులో భాగంగా మంథనిలో సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. మంథని రెవెన్యూ డివిజనల్ అధికారి సురేష్(Revenue Divisional Officer Suresh)కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బూడిద గణేష్ మాట్లాడుతూ... కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దుచేసి రాజ్యాంగ విరుద్ధంగా అప్రజా స్వామ్యంగా కార్మికులకు ఉరితాళ్లుగా మారిన నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చారని, ఈ లేబర్ కోడ్లు అమలయితే కార్మికులు కట్టు బానిసలుగా మారుతారని ఆవేదన వ్యక్తం చేశారు.
అదే విధంగా మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం భాగస్వామ్యం అవుతూ ఎనిమిది గంటల పని దినాన్ని 10 గంటల పని దినాలుగా మార్చుతూ జీవో నెంబర్ 282 ను తీసుకువచ్చి కార్మికులను ఆధునిక బానిసలుగా మార్చే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. వెంటనే మోడీ సర్కార్ నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, అలాగే తెలంగాణ సర్కార్ జీవో నెంబర్ 282ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రభుత్వాలు దిగచ్చేవరకు పోరాటాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు మంథని లింగయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బావురవి, ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి రాజ్ కుమార్, నాయకులు చిప్పకుర్తి చందు, ఎడ్ల పెళ్లి రాజయ్య, సుగుణ, కనకలక్ష్మి సునీత, మల్లీశ్వరి, రాజేశ్వరి, జ్యోతి, కొమురయ్య, రవి తదితరులు పాల్గొన్నారు.