30-12-2025 01:07:32 AM
ఆదిలాబాద్ జిల్లాకు తీవ్ర నష్టం చేస్తున్న బీజేపీకి కాంగ్రెస్ మద్దతు
ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లోనూ మంచి విజయం సాధించాలి
బోథ్ సర్పంచ్‌ల సన్మానంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, డిసెంబర్ 29 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు అయినా ఒక్క హామీ కూడా నెరవేరలేదని, రాష్ట్రంలో రైతుబంధు కాలం పోయి రాబందు పాలన వచ్చిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గ పరిధిలో గెలిచిన నూతన సర్పంచ్‌ల ఆత్మీయ సన్మాన సమావేశాన్ని సోమవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఆదిలాబాద్ జిల్లాలో అత్యధిక రైతాంగం పండించే పత్తి పంట కొనుగోలు చేసే పరిస్థితి కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో లేదని, ఈ ముఖ్యమంత్రి వచ్చాక పత్తి రైతు చిత్తుపోయాడని ఆవేదన వ్యక్తంచేశారు. సోయా రైతును పట్టించుకునే వారులేరని, రాష్ర్ట రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందుల పాలు చేస్తున్నదని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ హయాంలో తెలంగాణ రైతన్న రాజు లెక్క ఉండేవాడని, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ వారి ఇంటి ముందుకు వచ్చేవని గుర్తుచేశారు.
అందుకే ఏనాడూ తెలంగాణలోని రైతన్న కేసీఆర్ మీద కోపంతో లేరని, రైతుబంధు ఇచ్చినా, రైతుబీమా ఇచ్చినా, 7 వేల కేంద్రాలు పెట్టి పంట కొనుగోలు చేసినా.. అన్నీ రైతన్న కోసమే చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. గోదావరి, కృష్ణ నదులపైన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేశారని, కాళేశ్వరం కట్టి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును 90 శాతం పూర్తి చేశారని గుర్తుచేశారు.
అందుకే తెలంగాణ పంజాబ్ వంటి రాష్ట్రాలను తలదన్ని దేశంలోనే అత్యధికంగా ధాన్యం ఉత్పత్తి చేసిన రాష్ర్టంగా నిలిచిందన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో కేవలం కొన్ని వేల ఓట్లతో ఆదిలాబాద్, ఖానాపూర్, కాగజ్‌నగర్ వంటి నియోజకవర్గాలను చిన్నచిన్న పొరపాట్ల వల్ల కోల్పోయామని, కానీ బీఆర్‌ఎస్ వెంటే ఉన్నామని పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు తేల్చి చెప్పారని ఆనందం వ్యక్తంచేశారు. రెండేండ్ల కాలంలో కాంగ్రెస్ చేసింది ఏమీలేదని, మరో రెండేళ్ల తర్వాత కచ్చితంగా మన పార్టీ అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తంచేశారు.
ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌కు డబ్బు, దర్పం లేకపోవచ్చు, పేదవాడు కావచ్చు.. కానీ మంచి క్యారెక్టర్, మంచి మనసున్న నాయకుడని, అలాంటి నాయకుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీపైన, శ్రేణులపైన ఉన్నదన్నారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాను బీఆర్‌ఎస్ హయాంలో అద్భుతంగా అభివృద్ధి చేశామని, కానీ బీజేపీ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫ్యాక్టరీని తెరుస్తామని చెప్పి స్వయంగా అమిత్‌షా మాట ఇచ్చి తప్పారని గుర్తుచేశారు.
తెలంగాణతోపాటు ఆదిలాబాద్ జిల్లాకు తీవ్ర నష్టంచేస్తున్న బీజేపీకి కాంగ్రెస్ మద్దతు పలుకుతున్నదని, కేంద్రంలోని కాటన్ కార్పొరేషన్ పత్తి కొనకుంటే కాంగ్రెస్ ఏ రోజూ నిలదీయలేదని విమర్శించారు. రెండేండ్లలో రూ.2.5 లక్షల కోట్ల అప్పు చేసిన రేవంత్‌రెడ్డి తెలంగాణకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్‌చేశారు. గత ప్రభుత్వం అప్పులపై చెప్పిన తప్పుడు లెక్కలన్నింటినీ ప్రజలు గుర్తిస్తున్నారని తెలిపారు.
రానున్న మున్సిపల్ ఎన్నికల్లోనూ పంచాయతీ ఎన్నికల స్ఫూర్తితో పనిచేద్దామని, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో కూడా మంచి విజయం సాధించేలా కలిసి కృషి చేద్దామని పిలుపునిచ్చారు. గెలిచిన సర్పంచ్‌లు నిరాశ చెందాల్సిన అవసరం లేదని, రెండేండ్ల తర్వాత వచ్చే మన ప్రభుత్వంలో ప్రతి గ్రామాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసుకుందామని భరోసా ఇచ్చారు.
నియోజకవర్గానికి మనమే సీఎం.. మనమే మంత్రి
బోథ్ నియోజకవర్గానికి వచ్చేసరికి మనమే సీఎం.. మనమే మంత్రి.. మనమే గవర్నమెంట్ అని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ వెల్లడించారు. నియోజకవర్గానికి ఏ నా కొడుకులను రానిచ్చేది లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నియోజకవర్గ అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానని స్పష్టంచేశారు. బోథ్‌లో గెలిచిన 142 మంది సర్పంచులు కేసీఆర్ సైన్యం, కరడుగట్టిన తెలంగాణ వాదులని పేర్కొన్నారు. సర్పంచ్ ఎన్నికలకు సైతం బోథ్‌లో జాతీయస్థాయి కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేపట్టారని ఎద్దేవాచేశారు. బోథ్‌లో బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులు ఎక్కువగా గెలవడంతో కాంగ్రెస్ జాతీయ, రాష్ట్ర నాయకులు మనపైనే దృష్టి పెట్టారన్నారు.
మిగతా ఎన్నికల కోసం ప్రభుత్వం తర్జనభజన: జోగు రామన్న
గుర్తులు లేకుండా జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ 50 శాతానికి పైగా స్థానాల్లో గెలుపొందిందని మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న పేర్కొన్నారు. రానున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో గుర్తులు ఉంటే తాము గెలవలేమనే తర్జనభర్జనలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పడిందని అన్నారు. ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ బలపరిచిన సర్పంచులు గెలవడమే దీనికి నిదర్శనమన్నారు. దీంతో మిగతా ఎన్నికలు పెట్టాలంటే కాంగ్రెస్ భయపడుతోందని ఎద్దేవాచేశారు. జిల్లాల్లో స్వతంత్ర అభ్యర్థులు ఎక్కువగా గెలిచారని, వారిని కాంగ్రెస్, బీజేపీ తమ అభ్యర్థులని ప్రకటించుకోవడం సిగ్గుచేటన్నారు.