calender_icon.png 21 January, 2026 | 3:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గవర్నర్ల తీరు వివాదాస్పదం!

21-01-2026 12:29:10 AM

  1. ‘జన గణ మన’ గేయాన్ని సరిగ్గా ఉచ్ఛరించేలేదని తమిళనాడు గవర్నర్ రవి వాకౌట్
  2. ప్రసంగ పాఠంలో కొన్ని పేరాలు చదవని కేరళ గవర్నర్ ఆర్లేకర్

చెన్నై/ తిరువనంతపురం: రాష్ట్రప్రభుత్వాలు రూపొందించిన ప్రసంగ పాఠాన్ని పూర్తిగా చదవకుండా ఒకేరోజు తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి, కేరళ గవర్నర్ విశ్వనాథ్ ఆర్లేకర్ చట్టసభల నుంచి నిష్క్రమించారు. ‘జనగణమన’ గేయాన్ని సభ్యులు సరిగ్గా ఉచ్ఛరించలేదని తమిళనాడు గవర్నర్ సభ నుంచి వెళ్లిపోగా, ప్రసంగ పాఠంలో కొన్ని పేరాల చదవడం ఇష్టం లేక కేరళ గవర్నర్ సభ నుంచి వాకౌట్ చేశారు.

గవర్నర్ల వైఖరి రెండు రాష్ట్రాల్లో వివాదాస్పదమైంది. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తమిళనాడు అసెంబ్లీలోకి మంగళవారం ప్రవేశించిన గవర్నర్ ఆర్‌ఎన్ రవి రాష్ట్రమంత్రివర్గం ఆమోదించిన ప్రసంగం పాఠాన్ని ఆయన చదివేందుకు ఇష్టపడలేదు. సభ్యులు ‘జనగణ’ గేయాన్ని సరిగ్గా ఉచ్ఛరించలేదన్న కారణంతో గవర్నర్ సభ నుంచి వాకౌట్ చేశారు. స్పీకర్ అనంతరం ప్రభుత్వ ప్రసంగాన్ని సభలో చదివి వినిపించారు. సీఎం స్టాలిన్ సభలో స్పందిస్తూ.. గవర్నర్ తీరును ఖండిస్తూ సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ప్రభుత్వం ముద్రించిన ప్రసంగ పాఠమే అధికారిక రికార్డుల్లోకి వెళ్లేలా చర్యలు తీసుకున్నారు.

గవర్నర్ సభ నుంచి వెళ్లిపోయిన కాసేపటికి.. లోక్ భవన్ నుంచి ఒక ప్రకటన విడుదలైంది. ‘తమిళనాడు ప్రభుత్వం రూపొందించిన ప్రసంగ పాఠం వాస్తవ విరుద్ధంగా ఉంది. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుతూ తప్పుడు సమాచారంతో ప్రసంగ పాఠం రాశారు. రాష్ట్రానికి రూ.12 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ప్రభుత్వం రాసుకొచ్చింది. ఆ పెట్టుబడులన్నీ కాగితాలకే పరిమితం. సభలో కావాలనే మైక్ పదే పదే స్విచ్ ఆఫ్ చేశారు. దీంతో నేను మాట్లాడే అవకాశం లేకపోయింది. రాష్ట్ర గీతాలపన తర్వాత సభ్యులు జాతీయ గేయాన్ని ఆలపించలేదు. అది ముమ్మాటికీ గేయానికి అవమానమే’ అని గవర్నర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

కేరళ అసెంబ్లీలో..

కేరళ అసెంబ్లీ సమావేశాల ప్రారంభంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ తీరు వివాదాస్పదంగా మారింది. రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన ప్రసంగ పాఠంలోని కొన్ని కీలక అంశాలను గవర్నర్ చదవకుండా దాటవేశారు. అనంతరం సభ నుంచి నిష్ర్కమింంచారు.  ఈ అంశంపై స్పీకర్ ఏఎన్ షంషీర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సభా నిబంధనల ప్రకారం ప్రభుత్వ ప్రసంగ పాఠాన్నే అధికారికంగా భావిస్తామని స్పష్టం చేశారు. గవర్నర్ కొన్ని భాగాలను వదిలేస్తూ చదివిన ప్రసంగాన్ని తాము అధికారికంగా గుర్తించబోమని తేల్చిచెప్పారు. రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన పూర్తి ప్రతిని రికార్డుల్లోకి తీసుకుంటామని వెల్లడించారు. 

సభా సంప్రదాయాలకు అవమానం

చట్టసభ నుంచి గవర్నర్ వెళ్లిపోవడం బాధాకరం. తమ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ప్రసం గంలో పేర్కొన్న అంశాలను ఆయన ఉద్దేశపూర్వకంగా వదిలేశారు. ప్రసంగంలోని 12వ పేరా ప్రారంభ భాగాలను, 15వ పేరా ముగింపు అంశాలను గవర్నర్ చదవలేదు. ఇది సభా సంప్రదాయాలను ఉల్లంఘించడమే.

 పినరయి విజయన్, కేరళ ముఖ్యమంత్రి 

ప్రజాస్వామిక విలువకు గొడ్డలిపెట్టు

చట్టసభలో గవర్నర్ ఆర్.ఎన్.రవి ప్రసంగించకపోవడం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని అవమానపరచడమే. ప్రసంగ పాఠాన్ని చదవకుండా మధ్యలో వెళ్లిపోవడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ప్రజాస్వామ్య విలువలకు గొడ్డలిపెట్టు.

గవర్నర్ తన సొంత ఎజెండాను సభపై రుద్దాలని చూస్తున్నారు. రాజ్యాంగంలోని 176వ అధికరణ ప్రకారం కేబినెట్ ఆమోదించిన ప్రసంగాన్ని చదవాల్సిన బాధ్యత గవర్నర్‌పై ఉంటుంది. కానీ, గవర్నర్ ఆ పని చేయలేదు. అసెంబ్లీ సంప్రదాయాలను గవర్నర్ తుంగలో తొక్కారు. రాజ్యాంగపరమైన పదవిలో ఉండి రాజకీయాలు చేయడం తగదు. గవర్నర్ వైఖరిపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలుపుతాం.

 ఎంకే స్టాలిన్, తమిళనాడు ముఖ్యమంత్రి