09-01-2026 12:46:56 AM
ఘట్‌కేసర్, జనవరి 8 (విజయక్రాంతి) : కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎన్నో పోరాటాలు చేసిన గౌడన్నలకు ఎన్నికల ముందు ఇచ్చిన ఐదు హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసే విధంగా కృషి చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ మాజీ అధికార ప్రతినిధి, గౌడ సంఘాల సమన్వయ కమిటీ రాష్ట్ర నాయకులు బాలగోని వెంకటేష్ గౌడ్ గురువారం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంచార్జి మీనాక్షి నటరాజ్ ను కలసి విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రావడానికి, బిఆర్‌ఎస్ ప్రభుత్వం పై ఎన్నో పోరాటు చేసిన గౌడన్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను రెండు సంవత్సరాలు అయినా అమలు చేయకుండా విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గౌడ్స్ కు వైన్స్ లలో, బారులలో 25శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న ప్రభుత్వం నేడు ఆప్రస్థావనే తీసుకరావడం లేదని, జనగాం జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు నామకరణం చేసే విధంగా గెజిట్ విడుదల చేస్తామని,
ట్యాంక్ బండ్ పై పాపన్న గౌడ్ విగ్రహం పెడుతామని భూమి పూజ చేసి ఆరు నెలలు గడుస్తున్న ప్రభుత్వం అటువైపు పట్టించుకోవడం లేదని మీనాక్షి నటరాజన్ కు వివరించారు. తాటి చెట్ల మీది నుండి పడి మరణించిన గౌడన్నలకు రూ. 10 లక్షల పరిహారం ఇస్తామని, చెట్టు మీద నుండి పడి వికలాంగులుగా మారిన గౌడన్నలకు కూడా రూ. 10లక్షల పరిహారం ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. చర్లపల్లి రైల్వే టర్మినల్ కు పాపన్న గౌడ్ పేరు పెట్టే విధంగా, బీసిలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించే విధంగా ప్రభుత్వం తరుపున కృషి చేయాలని కోరినట్లు వెంకటేష్ గౌడ్ తెలిపారు.