calender_icon.png 23 December, 2025 | 3:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భవిష్యత్తులో ఏ ఎన్నిక జరిగినా కాంగ్రెస్ పార్టీ అప్రతిహతంగా గెలవబోతోంది

23-12-2025 01:40:14 AM

చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు డాక్టర్ మేడిపల్లి సత్యం 

కరీంనగర్ క్రైం, డిసెంబరు 22 (విజయ క్రాంతి): భవిష్యత్తులో ఏ ఎన్నిక జరిగిన కాంగ్రెస్ పార్టీ అప్రతిహతంగా గెలవబోతుందని చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ డిసిసి అధ్యక్షులు డాక్టర్ మేడిపల్లి సత్యం అన్నారు. సోమవారం కరీంనగర్ డిసిసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మాజీ కేంద్రమంత్రి స్వర్గీయ గడ్డం వెంకటస్వామి వర్ధంతి కార్యక్రమానికి హాజరై నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి, బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన గ్లోబల్ సమిట్ ద్వారా రేవంత్ రెడ్డి ప్రతిష్ట మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయిందన్నారు.

వచ్చే ప్రతి ఎన్నికలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో మేము అన్ని స్థానాలను కైవసం చేసుకుంటామన్నారు. బిఆర్‌ఎస్ పార్టీ తమ ఇంటిని చక్కదిద్దుకోవాలని, వారి ఇంటి కలహాలను తెలంగాణ ప్రజలపై రుద్ద వద్దని హితవు పలికారు. కెసిఆర్ కుమార్తె కవిత కెసిఆర్ హయాంలో బిఆర్‌ఎస్ చేసిన అన్యాయాలను, అక్రమాలను బయటపెడుతుందని, దాని పై నోరు విప్పాలని డిమాండ్ చేశారు. కేటీఆర్, హరీష్ రావు చెరోవైపు బిఆర్‌ఎస్ పార్టీని చీల్చాలని చూస్తున్నారని, కెసిఆర్ హడావుడిగా ఆ పార్టీని కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.

తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం పై పూర్తి విశ్వాసంతో ఉన్నారని పేర్కొన్నారు. కెసిఆర్ ఎప్పుడు ఒప్పుకున్నా అసెంబ్లీని సమావేశపరిచి పదేళ్ల పాలనలో టిఆర్‌ఎస్ చేసిన పనులపై, కాంగ్రెస్ ప్రజా పాలన పనులపై అన్ని స్థాయిల్లో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ చేసిన రుణ మాఫీ పై కానీ, మేము చేసిన అభివృద్ధిపై గానీ, రాష్ట్రంలో నియోజకవర్గాల వారీగా బిఆర్‌ఎస్ పార్టీ ఇచ్చిన దళిత బంధు పై కానీ చర్చించేందుకు మేము సిద్ధంగా ఉన్నామని, బిఆర్‌ఎస్ పార్టీ చేస్తున్న రాజకీయ డ్రామాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.