28-01-2026 12:20:16 AM
ఎమ్మెల్యే గంగుల కమలాకర్
కరీంనగర్, జనవరి 27 (విజయ క్రాంతి): రెండేళ్ల కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరీంనగర్ కు చేసిన అభివృద్ధి శూన్యమని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. మంగళవారం నగరంలోని 9వ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ పార్టీ ప్రభుత్వాల పాలనలో తెలంగాణ రాష్ట్రం నలబై, యాబై ఏళ్లు దరిద్రాన్ని అనుభవించిందన్నారు. ఈ రెండేళ్ల కాలంలో కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరీంనగర్ నగరానికి రెండు రూపాయల కూడా తీసుకురాలేదని విమర్శించారు.
బిఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన నిధులతో అభివృద్ధి చేస్తూ తామే ఆ నిధులు తీసుకువచ్చినట్టు గొప్పలు చెప్పుకుంటూ ఫోటోలు దిగుతున్నారని ఎద్దేవా చేశారు. 10 సంవత్సరాల కాలంలో బిఆర్‌ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి ఏంటో.. రెండేళ్ల కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన విధ్వంసం ఏంటో ప్రజలు గమనించాలనీ కోరారు. అబద్దాల హామీలతో కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిందని విమర్శించారు. కరీంనగర్ నగర పాలక సంస్థ మేయర్ పీఠం బిఆర్‌ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
బిఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కరీంనగర్ ను అన్ని విధాల అభివృద్ధి చేశామని.. మళ్లీ ప్రజలు బిఆర్‌ఎస్ పార్టీకి ప ట్టం కడితే నగరాన్ని మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ నగరశాఖ అధ్యక్షులు చల్ల హరి శంకర్, స్థానిక డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జంగిలి లత - ఐలెందేర్ యాదవ్, మాజీ కార్పొరేటర్లు మర్రి భావన- సతీష్, దిండిగాల మహేష్, గందె మాధవి- మహేష్, నలువాల రవీందర్, మాజీ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ కర్ర సూర్య శేఖర్, మాజీ సుడా డైరెక్టర్ నేతి రవివర్మ, నాయకులు సతీష్, మీడిదొడ్డి నవీన్, పాల్గొన్నారు.