calender_icon.png 7 May, 2025 | 5:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎండలో మాడిపోతున్న రైతన్న!

07-05-2025 12:24:28 AM

  1. వడ్ల కొనుగోలు కేంద్రాల్లో కనీస వసతులు లేక ఇక్కట్లు

ఫెసిలిటీస్ కల్పించినట్టు బిల్లులు పెడుతూ అధికారుల దోపిడీ

హుస్నాబాద్, మే 6 : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ డివిజన్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. నెలరోజులుగా తీవ్రమైన ఎండలు మండుతున్నా, రైతులకు కనీస వసతులు కల్పించడంలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారు. హుస్నాబాద్, అక్కన్నపేట, కో హెడ మండలాల్లోని కొనుగోలు కేంద్రాలను పరిశీలిస్తే అక్కడ కనిపించిన దృశ్యాలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి.

ఎండ వేడిమి త ట్టుకోలేక రైతులు చెట్ల నీడలో తలదాచుకుంటున్న దృశ్యం హృదయ విదారకంగా ఉం ది. కనీసం తాగడానికి మంచినీళ్లు కానీ, కూ ర్చోవడానికి నీడ కానీ లేకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలనే ఉద్దేశంతో ఐకేపీ, సొసైటీ, వ్యవసాయ మార్కెట్ల ద్వారా వడ్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పా టు చేసింది.

అయితే, కొనుగోలు కేంద్రాలు ప్రారంభించే ముందు ప్రభుత్వం నిర్దేశించిన కనీస నిబంధనలు మాత్రం ఎక్కడా కనిపించడంలేదు. రైతులకు విశ్రాంతి తీసుకోవడా నికి చలువ పందిర్లు లేవు, మంచినీటి సౌక ర్యం అంతంతమాత్రమే. రైతులు ఎండలో మాడిపోతున్నారు. మెడికల్ కిట్లు అందుబాటులో లేకపోవడం మరింత ఆందోళన కలిగి స్తోంది. పంది ర్లు లేక రైతులు తీవ్రమైన ఎం డలో మలమల మాడుతున్నారు.

చెట్ల నీడన కూర్చున్నా వారికి కాస్తంత ఉపశమనం లభించడం లేదు. అయినా అధికారులు కనీస మానవత్వం కూడా లేకుండా  వ్యవహరిస్తున్నారు. కొన్ని కేంద్రాల్లో చలువ పందిర్లు ఉన్నా, అవి నామమాత్రంగానే ఉన్నాయి. వాటి నిర్వహ ణ సరిగా లేకపోవడంతో అవి ఏ మాత్రం ఉపయోగపడడంలేదు. పేరుకే లక్షల రూపాయలు ఖర్చు చేశారని చెబుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది.

ఇంతటి దుర్భర పరిస్థితుల్లోనూ, కొనుగోలు ప్రక్రియలో జాప్యం జరుగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కష్టాన్ని చెప్పుకోవడానికి ప్రయత్నించినా, అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్  ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేసినా స్పందన లేదని పలువురు రైతులు తెలిపారు.

నిర్వహణ గాలికి

కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి చేతులు దులుపుకున్నారే తప్ప, అధికారులు వాటి నిర్వహణను పట్టించుకోవడం లేదు. రెవెన్యూ డివిజన్ అధికారులు, స్థానిక తహసీల్దార్లు కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షిం చాల్సిన బాధ్యతను విస్మరిస్తున్నారు.

ఇప్పటివరకు ఒక్క అధికారి కూడా క్షేత్రస్థాయికి వచ్చి పరిస్థితిని సమీక్షించిన దాఖలాలు లేవు. సొసైటీ, ఐకేపీ అధికారుల నిర్ల క్ష్యం ఎంత దారుణంగా ఉందం టే,  రైతులు ఎండలో ఆరబోసిన వడ్లను కాపాడుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నా కనీసం పట్టించుకోవడంలేదు.

 వసతుల పేరుతో దోపిడీ

వడ్ల కొనుగోలు కేంద్రాల్లో వసతులు కల్పించకుండానే చలువ పందిర్లు, మంచినీటి సరఫరా, మెడికల్ కిట్ల పేరుతో అధికారులు లక్షలాది రూపాయల బిల్లులు పెట్టి డ్రా చేసుకుంటున్నారని సమాచారం. ఇది రైతుల సొమ్మును దుర్వినియోగం చేయడమే. దీనిపై జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని భారతీయ కిసాన్ సంఘ్ డివిజన్ ఇన్ చార్జి కవ్వ వేణుగోపాల్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు.

కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన విజయక్రాంతి’కి ప్రత్యేకంగా వివరించారు. ‘ఈ మూడు మండలాల్లో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాల్లో భారతీయ కిసాన్ సంఘ్ కార్యకర్తలు పర్యటించి చూశా రు. ఎక్కడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం కనీస వసతులు లేవు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట. రైతుల పట్ల వీరికి ఏ మాత్రం కనికరం లేదు.

చలువ పందిర్లు, మంచినీళ్ల పేరుతో లక్షలు దోచుకుంటున్నారు. జిల్లా కలెక్టర్  వెంటనే జోక్యం చేసుకొని ఆర్డీవో, తహసీల్దార్ల ద్వారా విచారణ జరిపించాలి. రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. రెండు రోజుల్లోగా రైతులకు అన్ని సదుపాయాలు కల్పించకపోతే, రైతులతో కలిసి మంత్రి  క్యాంప్ ఆఫీసును ముట్టడిస్తాం. మా సహనాన్ని పరీక్షించవద్దు‘  అని హెచ్చరించారు. 

 మా బాధలు ఎవ్వలు జూత్తలేరు

నెలరోజుల సంది తిప్పలు వడుతన్నం. ఎండల ఎండుతన్నం. ఒగ టెంట్ ఏసినోళ్లు లేరు. నీళ్లు ఇచ్చినోళ్లు లేరు. పొద్దంత ఎండల వడ్లను నేర్పుతన్నం. పొద్దుగూకంగనే మబ్బులు, గాలిదుమారమత్తంది. పొద్దంత ఎండల మాడుతన్నం. రాత్రి గాంగనే వాన వస్తదేమోనని భయపడుతున్నం. వడ్లమీద వరుకులు గప్పుకుంటనే కంటికి కునుకులేకుంట ఉంటున్నం. మా బాధలు ఎవ్వలు జూత్తలేరు.

 బోయిని ఈశ్వరయ్య, రైతు, మడద