21-08-2025 12:00:00 AM
- తెలంగాణ సినిమా వేదిక డిమాండ్
సినిమా ప్రతినిధి/ఖైరతాబాద్: తెలంగాణ, ఆంధ్ర సినిమా విభజన చట్టాన్ని అమలు చేయాలని, తెలంగాణ సినిమా పాలసీని తక్షణమే రూపొందించాలని వక్తలు డిమాండ్ చేశారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ సినిమా వేదిక (టీసీవీ) గౌరవాధ్యక్షుడు తుమ్మల ప్రఫుల్ రామ్‌రెడ్డి అధ్యక్షతన ‘సినిమా కార్మికుల సమ్మె.. తెలంగాణ, -ఆంధ్ర సినిమా విభజన‘ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో ప్రముఖ దర్శకుడు ఎన్ శంకర్, ప్రొఫెసర్ నందిని సిధారెడ్డి, చల్ల శ్రీనివాస్, పీ కుల్జారెడ్డి, సినిమా ఆర్టిస్ట్ భూక్యా బాలు, నటుడు కార్తీక్‌రెడ్డి తదితర ప్రముఖులు మాట్లాడారు. సినిమా అభివృద్ధికి ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకొని రియల్ ఎస్టేట్ సంస్థగా మార్చిన కే రాఘవేంద్ర స్టూడియో, పద్మాలయ స్టూడియో, ఆనంద్ సినీ సర్వీస్, రామా నాయుడు, ఎన్‌బీకే ఎస్టేట్, గోల్కొండ క్రాస్‌రోడ్డు ఎన్టీఆర్ స్టూడియోలను తక్ష ణమే రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలన్నారు.
వంద ఎకరాల్లో ప్రొఫెసర్ జయశంకర్ ఫిలిం యాక్టింగ్ స్కిల్ వర్సిటీని ఏర్పాటు చేయాలని కోరారు. తెలంగాణ భాష, యాస సంస్కృతిలో వచ్చే సినిమాలకు 50 శాతం సబ్సిడీని అందజే యాలని కోరారు. తెలంగాణలో థియేటర్ల సిండికేట్ విధానాన్ని అరికట్టాలని కోరారు. ఆంధ్ర సినిమాలకు ఇచ్చిన గద్దర్ ఫిలిం అవార్డులను ప్రభుత్వం రద్దు చేసి, తెలంగాణ వారికి ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో వేదిక రాష్ట్ర అధ్యక్షుడు లారా, కార్యదర్శి మోహన్ బైరాగి, షావలి, ఐఎనన్టీటీవీ అంజలికుమారి, జోగిరాల, పీవోడబ్ల్యూ సునీత తదితరులు పాల్గొన్నారు.